
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచింది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని లంబాడీ సామాజిక వర్గానికి చెందిన జట్వతీ సోనీనాయక్ ఇంటిని ఆయన సందర్శించారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారి ఇంట్లో టిఫిన్ చేసి.. టీ తాగారు. పార్టీ కార్యకర్తలైన ఆ కుటుంబానికి బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు.
ఐతే… అమిత్ షా ఆ ఇంట్లో ఏం తిన్నాడు… ఏం వంటలు వండారు.. వారు రోజూ తినేదేంటి… ఈరోజు ప్రత్యేకంగా ఏం తయారు చేశారు.. అవి వారి ఇంట్లోనే తయారుచేసినవా.. కాదా… అని రాష్ట్ర ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీయడం మీడియా కంటపడింది. అమిత్ షా తిన్నదేంటి.. ఆయనకు వడ్డిస్తామని చెప్పిన వంటకాలు ఏంటి… ఆయనకు వడ్డించిన వంటకాలు ఏంటి అని ప్రశ్నించడం కనిపించింది. అమిత్ షా తిన్న ప్లేట్ ను కూడా కొందరు ఇంటలిజెన్స్ వ్యక్తులు బయటకు తెప్పించుకుని పరిశీలించారు. వాటిలో ఉప్మా ఉండటంతో… ఉప్మా ముందుగా చెప్పిన లిస్టులో లేదు కదా అని ప్రశ్నించారు. అమిత్ షాకు పెట్టిన ఆహారం.. హోటల్ నుంచి తెప్పించారా అని సోనీనాయక్ కుటుంబసభ్యులను ప్రశ్నించడం మీడియా గుర్తించింది.
ఐతే… అమిత్ షాకు తాము ప్రతిరోజూ తినే రొట్టె, పప్పు కూరలనే వండి పెడతా అని.. సోనిబాయినాయక్ మీడియా ప్రతినిధులకు చెప్పింది. ఆమె ఇంట్లోనూ ఆ వంటకాల తయారీలో అవే కనిపించాయి.