కేంద్ర పథకాలను రాష్ట్రం అడ్డుకుంటోంది : కేంద్ర మంత్రి బీఎల్ ​వర్మ

కేంద్ర పథకాలను రాష్ట్రం అడ్డుకుంటోంది : కేంద్ర మంత్రి బీఎల్ ​వర్మ

ఐనవోలు, వెలుగు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార శాఖ సహాయ మంత్రి బీఎల్ ​వర్మ అన్నారు. ఆయుష్మాన్​ భారత్​కు అడ్డుపడుతోందని, పేదలకు వైద్యం అందకుండా చేస్తోందని మండిపడ్డారు. లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలానికి వచ్చారు.  ఐనవోలు మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాత పున్నేలు గ్రామంలో ఆయుష్మాన్​ భారత్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మోడీ పథకాలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీం ద్వారా కేంద్రం ప్రతి పేద కుటుంబానికి  రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తోందన్నారు.

నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకంపై సరైన అవగాహన లేక అనేక మంది వినియోగించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఇచ్చే పరిస్థితిలో లేదని,  కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద కట్టిస్తుంటే రాష్ట్రం అడ్డుగోడగా నిలుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోడీ సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేరుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ రామారావు, పార్టీ  హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.