సల్లంగసూడు మైసమ్మ .. గాంధారి మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

సల్లంగసూడు మైసమ్మ .. గాంధారి మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
  • బోనమెత్తిన రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ ​వెంకటస్వామి
  • మొక్కులు తీర్చుకున్న భక్తులు, సింగరేణి జీఎంలు, ప్రముఖులు

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: వర్షాలు బాగా కురిపించి పాడిపంటలు పండించు.. సకల సంపదలు కలిగించు మైసమ్మ తల్లీ అంటూ భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆషాడ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం బొక్కలగుట్ట శివారు రాళ్లవాగు ఒడ్డున ఉన్న చెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు,శివసత్తులు బోనాలను నెత్తిన పెట్టుకొని మైసమ్మ ఆలయానికి బయలుదేరగా.. వీరికి వేలాది భక్తులు ఎదురొచ్చి స్వాగతం పలికారు. పోతురాజులు, జోగినుల  విన్యాసాల నడుమ భక్తులు అమ్మవారికి 250 బోనాలు సమర్పించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు కోల్​బెల్ట్​ ప్రాంతానికి చెందిన వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనమెత్తిన మంత్రి వివేక్

గాంధారి మైసమ్మ జాతరతోపాటు వెంకటాపూర్​గ్రామంలో పోచమ్మ బోనాలు, సీసీసీ కార్నర్​లో ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత బోనాల జాతరలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి బోనమెత్తారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్​ రావు, బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్​ గౌడ్, దుర్గం అశోక్, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎంలు జి.దేవేందర్, శ్రీనివాస్, రాజేశ్వర్​ రెడ్డి, మంచిర్యాల డీసీపీ భాస్కర్, అధికారులు, నేతలు హాజరై పూజలు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​ రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.