కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో 3 రోజుల పాటు నిర్వహించే స్టేట్ లెవల్ సైన్స్ ఫెయిర్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన కామారెడ్డి సమీపంలోని పాతరాజంపేట విద్యానికేతన్ స్కూల్లోని అబ్దుల్ కలాం ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 7 అంశాల్లో 880 ఎగ్జిబిట్స్ వచ్చాయి. 1,700 విద్యార్థులు, టీచర్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్‌ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ఆర్జేడీ సత్యానారాయణ ప్రారంభించి ఎగ్జిబిట్స్ పరిశీలించారు. స్టూడెంట్స్ ఎగ్జిబిట్స్ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి వస్తుందని తెలిపారు.
చిన్నప్పటి నుంచే శాస్ర్తీయ ఆలోచనలు అలవడితే గొప్ప శాస్ర్తవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాం రెడ్డి పాల్గొన్నారు.
