పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
  • రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి

లింగంపేట, వెలుగు: గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ ఎం.కోదండరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో గురువారం పోడు భూముల సమస్యపై ఉమ్మడి జిల్లాలోని గిరిజన రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి నేటి వరకు పాస్ బుక్కులు రాకపోవడం, కొందరి భూమి తక్కువగా నమోదు కావడం, హక్కుపత్రాలు ఉన్నప్పటికీ సాగు చేసుకోనివ్వకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.

పోడు భూములకు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం, ఫారెస్ట్,​- రెవెన్యూ భూముల మధ్య వివాదం, ఆన్​లైన్​లో వివరాలు లేకపోవడడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్​ పట్టాలు భూభారతి పోర్టల్​లో కనిపిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ. పోలీస్​ శాఖలు  సమన్వయంతో పని చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం పలు సమస్యలపై రైతులు వినతిపత్రాలు అందజేశారు. రైతు కమిషన్​ సభ్యుడు సునీల్​ పోడు భూముల హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. కమిషన్​ సభ్యులు రాములునాయక్, గడుగు గంగాధర్, అడిషనల్​ కలెక్టర్​ విక్టర్, బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​రావు, తహసీల్దార్​ రేణుక చౌహాన్​ పాల్గొన్నారు.