జీతాలు ఇవ్వకుండా.. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా..? : రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్

జీతాలు ఇవ్వకుండా.. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా..? : రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
  • కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై 
  • రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆగ్రహం

కాగ జ్ నగర్, వెలుగు: ‘‘ మీ తీరుతో ప్రభుత్వం బద్నాం అవుతోంది. ఫండ్స్ రిలీజ్ చేసినా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు. సమస్యను స్టేట్ కమిషనర్ వచ్చి క్లియర్ చేయాలా..? ’’ అంటూ కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా మంగళవారం ఆయన కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. 

ఆస్పత్రిలో రోగులకు అందించే సేవలు, డాక్టర్లు, ఇతర స్టాఫ్ వివరాలు అడిగి తెలుసుకుని, మెడికల్ స్టోర్, ఇతర విభాగాలను తనిఖీలు చేశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చెన్నకేశవ తీరుపై మండిపడ్డారు. ఆస్పత్రిలో  సమస్యలు ఉండడమే కాకుండా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు నెలలుగా ఇవ్వలేదని కార్మికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందించారు. దీంతో ఆయన ఇదేంటని సూపరింటెండెంట్ ను ప్రశ్నించారు. 

నిధులు విడుదల చేసినా ఎందుకు ఇవ్వలేదని, ఇది సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని సమస్యలు, ఇబ్బందులపై పూర్తి విచారణ చేయాలని డీఎంహెచ్ వో సీతారాం నాయక్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, వానా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండగా డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు.