చాన్స్​ ఇస్తే.. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తా : అనిల్ కుమార్

చాన్స్​ ఇస్తే.. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తా : అనిల్ కుమార్
  •    రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్​ అనిల్ కుమార్

బషీర్ బాగ్, వెలుగు : చేనేత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ చెప్పారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతేడాదికి సంబంధించిన బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్​ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్

గౌరవ వేతనాల అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి మాట్లాడతానని హామీని ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్​ఐదుగురు బీసీలకు ఎంపీ టికెట్లు కేటాయిస్తామని హామీని ఇచ్చిందని, నిజామాబాద్ టికెట్ తనకు కేటాయించే అవకాశం ఉందని అనిల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాన్స్​ఇస్తే పోటీకి సిద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్యతోపాటు చేనేత అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి,  తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర్తకు మురళి, అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, ప్రధాన కార్యదర్శి వనం విశ్వనాథం, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల 
తదితరులు పాల్గొన్నారు.