కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్రం నిర్లక్ష్యం.. పైసలియ్యదు.. భూములియ్యదు

కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్రం నిర్లక్ష్యం.. పైసలియ్యదు.. భూములియ్యదు
  • ఎక్కడికక్కడే ఆగిపోయిన పనులు
  • డ్రై పోర్ట్‌‌ను ఏడ పెట్టాల్నో  క్లారిటీ లేదు
  • వరంగల్‌‌ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర వాటాలో సగం నిధులు కూడా ఇయ్యలే
  • ఎంఎంటీఎస్​ ఫేజ్​ 2కు రాష్ట్రం తన వాటాలో ఇచ్చింది పావు వంతే
  • ఆర్వోబీ, ఆర్​యూబీ, హైవే పనులూ పెండింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నా, వాటికి నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర సర్కార్  మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. తన వాటా నిధులు విడుదల చేయడంలేదు. భూములూ ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి ప్రాజెక్ట్‌‌లు అక్కడే ఆగిపోతున్నాయి. రెండు రైల్వే టెర్మినల్స్​ కోసం చాలా కాలం నుంచి దక్షిణ మధ్య రైల్వే భూములు అడుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. వరంగల్‌‌ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌కు సగం నిధులన్నా విడుదల చేయలేదు. డ్రైపోర్ట్‌‌ అంశం ప్రతిపాదనల దశను కూడా దాటలేదు. దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వంలో క్లారిటీ లేకుండా పోయింది. ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌ 2 ప్రాజెక్టును 2019లో పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ పనులు స్లోగానే సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హైవేలు, ఫ్లై ఓవర్​ బ్రిడ్జీలు, మంచిర్యాల జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం.. ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్​లో పడిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడం, ల్యాండ్‌‌ పూలింగ్‌‌ చేయకపోవడంతోనే  సమస్యలు వస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌ 2 ప్రాజెక్ట్‌‌ 2012––13 ఆర్థిక సంవత్సరంలో మంజూరైంది. హైదరాబాద్​, సికింద్రాబాద్​ జంట నగరాల్లో  చేపట్టే ఈ పనులు 2019 వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీని మొత్తం ఖర్చు అంచనా రూ. 830 కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ. 556 కోట్లు. రైల్వే (కేంద్రం) వాటా రూ. 274 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు స్లోగా సాగుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్ట్‌‌  ఖర్చు పెరిగిపోయింది. ఈ ప్రాజెక్ట్‌‌ కింద ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం తన వాటాకు రెండింతలు ఖర్చు చేసింది. రూ. 750 కోట్లు వెచ్చించింది. తెలంగాణ ప్రభుత్వం తన  వాటాలో దాదాపు 24 శాతం వరకే అంటే.. రూ. 129 కోట్లు మాత్రమే ఇచ్చిందని రైల్వే ఆఫీసర్లు చెప్తున్నారు. ఇంకా రూ. 427 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎంఎంటీఎస్​ ఫేజ్​ 2 అందుబాటులోకి వస్తే రెండు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. నగరంలో ట్రాఫిక్‌‌ ఇక్కట్లు కూడా తగ్గుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు విస్తరించాలనుకున్నా అదీ ముందుకు పడటంలేదు. ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌-2కు రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తం విడుదల చేయాలని సీఎం కేసీఆర్​కు  ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌‌ రెడ్డి కూడా లెటర్‌‌ రాశారు.

డ్రై పోర్ట్‌‌  ఏడ పెట్టాల్నో క్లారిటీ లేదు

తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో డ్రై పోర్ట్ ఇస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో ఏర్పాటు చేయాలని అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఖమ్మం జిల్లాలో డ్రై పోర్ట్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని, డ్రైపోర్ట్ ఏర్పాటుకు అవ‌‌స‌‌ర‌‌మైన స‌‌హ‌‌కారం కేంద్రం నుంచి ఉంటుంద‌‌ని అప్పటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామ‌‌న్ కూడా ప్రక‌‌టించారు. అయితే ఖమ్మం జిల్లాలో ఏర్పాటు అని ఒకసారి, మహబూబ్ నగర్ జిల్లాలో అని మరోసారి, నల్గొండ, నిజామాబాద్‌‌ జిల్లాల్లో అని ఇంకోసారి ఇట్ల రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దీంతో డ్రైపోర్టు అంశం ప్రతిపాదనల దశనే దాటలేదు. ఇది అందుబాటులోకి వస్తే 5 వేల మందికిపైగా ఉపాధి దొరుకుతుంది. సముద్ర ఓడ రేవులు లేని రాష్ట్రాల నుంచి వేగంగా ఎగుమ‌‌తులు, దిగుమ‌‌తులు చేయడానికి డ్రైపోర్ట్‌‌ ఉపయోగపడుతుంది. డ్రైపోర్ట్ వల్ల గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌసింగ్ లాంటి ఫెసిలిటీస్‌‌ అందుబాటులోకి వస్తాయి.

వరంగల్‌‌ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌కు 12 కోట్లే

వరంగల్​ కాకతీయ మెడికల్​ కాలేజీ ఆవరణలో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద  2016లో రూ. 150 కోట్లతో సూపర్​ స్పెషాలిటీ  హాస్పిటల్​ నిర్మాణ పనులు ప్రారంభించారు. 250 బెడ్ల సామర్థ్యంతో ఉమ్మడి వరంగల్​ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ. 120 కోట్లు కాగా, ఇప్పటికే రూ. 106 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 30 కోట్లు కాగా.. ఇప్పటిదాకా రూ. 12 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతా ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో నిర్మాణ పనులు స్లోగా జరుగుతున్నాయి. స్టాఫ్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌  కూడా ఆలస్యమవుతోంది.

ఆర్వోబీ, ఆర్​యూబీ ప్రాజెక్టులు పెండింగ్​

కేంద్రం డబ్బులిచ్చినా రాష్ట్రం నిధులు విడుదల చేయకపోవడంతో రైల్వే ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా అక్కన్నపేట-– మెదక్ రైల్వే లైన్, మనోహరాబాద్ –- కొత్తపల్లి, భద్రాచలం-–సత్తుపల్లి, మణుగూరు-– రామగుండం ప్రాజెక్ట్‌‌ పనులు ముందుకు సాగడంలేదు. రాష్ట్రంలో సుమారు 100కు పైగా రోడ్​ ఓవర్​ బ్రిడ్జెస్​(ఆర్వోబీ),  రోడ్​ అండర్​ బ్రిడ్జెస్​ (ఆర్‌‌యూబీ) ప్రాజెక్ట్‌‌ పనులు పెండింగ్‌‌లో ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం, రాష్ట్రం 50 శాతం చొప్పున భరించాలి. మరికొన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్‌‌ చేయడంలేదు.

ల్యాండ్​ ఇవ్వక.. ఎన్నో ప్రాజెక్టులకు బ్రేక్

2016లో కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ చేసింది. కొత్త బిల్డింగ్స్ కోసం ఫండ్ ఇచ్చింది. టెంపరరీగా రెంట్ బిల్డింగ్‌‌లో స్కూల్ స్టార్ట్ చేశారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కేటాయించకపోవడంతో  స్కూల్ ను రద్దు చేయాల్సి ఉంటుందని కేంద్రం నోటీస్ పంపింది. దీంతో ఎంపీ వెంకటేష్ నేత ఇటీవల గుడిపేటలో ల్యాండ్ పరిశీలించినా కొలిక్కి రాలేదు. హైవేస్‌‌కు సంబంధించిన భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ రాష్ట్రం ఇవ్వట్లేదు. చాలా చోట్ల ల్యాండ్‌‌ పూలింగ్‌‌ చేయక పనులు ఆగుతున్నాయి. హైదరాబాద్‌‌లోని అంబర్‌‌పేట ఫ్లై ఓవర్‌‌ నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారింది.

చర్లపల్లి టెర్మినల్​కు ల్యాండేది?

హైదరాబాద్ శివారులో చర్లపల్లి టెర్మినల్ కోసం 150 ఎకరాల స్థలం కావాలని దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు ప్రతిపాదించగా వివిధ కారణాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదు. గత్యంతరం లేక చివరికి చర్లపల్లి స్టేషన్ వద్ద 50 ఎకరాల రైల్వే స్థలంలోనే టెర్మినల్ ను కడుతున్నారు. నాగులపల్లి వద్ద కూడా టెర్మినల్ కోసం 100 ఎకరాలు భూమి కావాలని రైల్వే కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది

రాష్ట్ర ప్రభుత్వ నిధులేవి?

ఎంఎంటీఎస్  ఫేజ్ 2 కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్ట్​ పూర్తయితే రెండు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. సిటీలో ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఎంఎంటీఎస్​ను యాదాద్రి వరకు విస్తరిస్తామని చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్వోబీ, ఆర్​యూబీలకు కూడా నిధులు ఇస్తలేరు.

– శివ శంకర్, ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ నేత

మ్యూచువల్​ గ్రాంట్స్​ పూర్తిగా  ఇవ్వాలి

నిరుపేద, మధ్య తరగతి ప్రజలు సూపర్​ స్పెషాలిటీ ట్రీట్​మెంట్​ కోసం ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్తే అక్కడ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నరు. నిరుపేదలకు బెస్ట్​ ట్రీట్​ మెంట్​ అందించేందుకు కేంద్రం మంజూరు చేసిన పీఎంఎస్​ఎస్​వై హాస్పిటల్‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. కేంద్ర నిధులకు రాష్ట్రం మ్యూచువల్​ గ్రాంట్స్​ పూర్తిగా విడుదల చేయాలి. వెంటనే సిబ్బందిని నియమించి ఉమ్మడి వరంగల్​తో పాటు ఇక్కడికి వచ్చే చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.

– కూచన క్రాంతి, వరంగల్​