రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వినోద్ కుమార్ 

రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వినోద్ కుమార్ 

రిమోట్ ఓటింగ్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత,  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ చెప్పారు. రిమోట్ ఓటింగ్ విధానం ప‌ద్ధతి ఇండియాలో అవ‌స‌రం లేదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప‌క్కన పెడుతున్నాయని చెప్పారు. రిమోట్ ఓటింగ్ విధానంపై బీఆర్ఎస్ లో చర్చించి.. ఈనెల 30వ తేదీలోపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా పార్టీ అభిప్రాయం తెలుపుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసీ సమావేశం నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వినోద్ కుమార్ సమాధానం ఇచ్చారు. 

ప్రస్తుతం ఎన్నిక‌ల్లో ఉపయోగిస్తున్న EVMలను హ్యాక్ చేస్తున్నార‌నే అనుమానాలు, ప్రచారాలు ప్రజల్లో బ‌లంగా ఉన్నాయని వినోద్ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. EVMలపై ఉన్న అనుమానాలను ఇప్పటివరకూ ఈసీ నివృత్తి చేయ‌లేదని, అలాంటప్పుడు రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను ప‌క్కన‌ పెట్టాయన్నారు. నిత్యం బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేస్తున్న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయని, అలాంట‌ప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా న‌మ్మగ‌లం అని ప్రశ్నించారు. విదేశాల నుంచే ఓటరు తన ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నాడా..? అని ఎలా తెలుసుకోగ‌లం అని అనుమానాలు వ్యక్తం చేశారు.