- రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఫైర్
- కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా, అనాగరికంగా, అసభ్యకరంగా ఉన్నాయని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో డీజీపీ శివధర్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై. గోపిరెడ్డి బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
“కేటీఆర్ ఒక వార్తా చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ .. రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ నాయకత్వంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో తెలంగాణ పోలీసులు పని చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మేం చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తాం. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా పని చేస్తున్నది. శాంతి భద్రతలను కాపాడడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కేటీఆర్ ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారు.
దోపిడీ, హత్యల కేసుల్లో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నారు. పోలీసుల పనితీరులో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. ఒకవేళ ప్రశ్నించవలసి వచ్చినా సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని మేం గుర్తు చేస్తున్నాం. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర డీజీపీపై అభ్యంతరకర భాషలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆయన పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలి” అని ప్రకటనలో గోపిరెడ్డి డిమాండ్ చేశారు.
