సీబీఐ కన్నా రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్టం: మంత్రి జగదీశ్‌ రెడ్డి

సీబీఐ కన్నా రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్టం: మంత్రి జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు: జీవో అంటే గవర్నమెంట్‌ ఆర్డర్‌ అని, దానిని ఎక్కడ, ఎప్పుడు బయట పెట్టాలో తమ ప్రభుత్వానికి తెలుసని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సీబీఐ కన్నా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ పటిష్టమైందన్నారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడుకు, నల్గొండ జిల్లా అభివృద్ధికి కేంద్రం రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తే బీజేపీకి కావాల్సిన ఎమ్మెల్యే సీటు వదులుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగియనడానికి ఇంకా ఒక రోజు టైం ఉందని ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆ పార్టీ నేతలు ప్రకటన చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారని, అది చూసి ఓర్వలేకే.. డబ్బుతో ఏమైనా చేయగలమన్న అహంకారంతో ఈ ఉప ఎన్నిక తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ బహిరంగ సభతో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందన్నారు. బీజేపీ నేతలకు ఎమ్మెల్యేను కొని ఉప ఎన్నిక తేవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ఎందుకు లేదన్నారు. ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్లతో వచ్చేది ఉప ఎన్నిక మాత్రమేనని మునుగోడుతో తేటతెల్లం అయ్యిందన్నారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే బీజేపీ అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ  అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2014కు ముందు మునుగోడులో రోడ్లు లేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు వేశామన్నారు. ప్రజలు డిమాండ్‌ చేస్తేనే ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేలు గ్రామాల్లో రోడ్లు వేయిస్తామని హామీలు ఇస్తున్నారని, అంతమాత్రాన అక్కడ అభివృద్ధి జరగలేదనడం సరికాదన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల్లో వాటాలు తేలుస్తామని, ప్రాజెక్టులకు పర్మిషన్‌లు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిషన్‌ కాకతీయ, చెక్‌డ్యాంలతో మునుగోడు ఎంతో కొంత సస్యశ్యామలం అయ్యిందన్నారు. 

బీజేపీకి బీ టీమ్​గా కాంగ్రెస్‌

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌.. బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్​ను  బతికించాలనుంటే, బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలనుకుంటే రాహుల్‌.. గుజరాత్‌లో ఎందుకు పాదయాత్ర చేయడం, మోడీతో ఏమైనా అగ్రిమెంట్‌ చేసుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీనే జోడించలేని ఆయన దేశాన్ని ఏం జోడించగలరన్నారు. కాంగ్రెస్‌తో తామెందుకు పొత్తు పెట్టుకుంటామన్నారు.