కేసీఆర్ పాలనను బొంద బెడితేనే తెలంగాణ తల్లికి విముక్తి

కేసీఆర్ పాలనను బొంద బెడితేనే తెలంగాణ తల్లికి విముక్తి
  • అందుకే గడికోసారి కేటీఆర్ ​ఫారిన్ టూర్: సంజయ్
  • మునుగోడులో సీఎం ఎంత ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే

యాదాద్రి, వెలుగు: నిజాం లెక్క సీఎం కేసీఆర్​ కూడా రాష్ట్ర ప్రజల రక్తం తాగి దోపిడీ చేసి సంపాదించారని, ఆ పైసలన్నీ విదేశాల్లో దాచుకొని ఆస్తులు కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ‘‘కేసీఆర్​ కొడుకు గడికోసారి లండన్, దుబాయ్, అమెరికా పోతున్నడు. ఇక్కడి పైసలతో అక్కడ ఆస్తులు సంపాదించుకుంటున్నరు. నిజాం ప్రభుత్వం ఎలా ఉండేదో ఇప్పుడు కేసీఆర్​ మనకి చూపిస్తున్నడు. ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తూ, బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయిస్తున్నడు” అని సంజయ్​వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర శనివారం మోత్కూర్​ మండలంలో ప్రవేశించింది. యాత్ర ప్రముఖ్​ గంగిడి మనోహర్​రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు అధ్యక్షతన పొడిచేడు, మోత్కూర్​లో నిర్వహించిన సభలో సంజయ్​మాట్లాడారు.

సీఎం కుర్చీ లేకుండా కేసీఆర్​ ఒక్కరోజు కూడా బతకలేరని ఆయన విమర్శించారు. కుర్చీ విషయంలో కొడుకు, కూతురు, అల్లుడి మధ్య కేసీఆర్​ లొల్లి పుట్టించారని పేర్కొన్నారు. వాళ్లలో వాళ్లకు కొట్లాట పెట్టిన కేసీఆర్​, సీఎం కుర్చీ మీద కూర్చున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనను బొంద పెడితేనే తెలంగాణ తల్లికి విముక్తి కలుగుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. మునుగోడు బైపోల్​లో  కేసీఆర్​ ఎంత ఖర్చుపెట్టినా, ఓటుకు ఎన్ని పైసలు ఇచ్చినా బీజేపీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిండు

లక్షల కోట్లు ఖర్చు చేసి ఫాంహౌస్​కు కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్.. మోత్కూరుకు రూ.200 కోట్లు పెట్టి బునాదిగాని కాల్వను బస్వాపూర్​ రిజర్వాయర్​కు అనుసంధానం చేయడం లేదని సంజయ్​అన్నారు. తన ఫాంహౌజ్​కు ఫ్రీ కరెంట్​సరఫరా చేయించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాల్జేసీ చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారని ఫైర్​అయ్యారు. బీజేపీకి ఓట్లు వేయకున్నా, కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తుంగతుర్తి నియోజకవర్గానికి మంజూరు చేసిందని ఆయన తెలిపారు. 20 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా వారి డిమాండ్లను కేసీఆర్​ పరిష్కరించడం లేదని, కనీసం వారితో మాట్లాడిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ మూర్ఖపు పాలన కొనసాగుతోందన్నారు. నయా నిజాం పాలన చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు.  ఉద్యమకారుడు పిడమర్తి నాగరాజు ప్రగతి భవన్​లో కేసీఆర్ ను కలిసే పరిస్థితి కూడా లేదన్నారు. అమరుల ఆశయాలు, లక్ష్యాలను చేరుకునేందుకు బీజేపీ పని చేస్తోందని, కవులు, కళాకారులు, మేధావివర్గంతో పాటు ఉద్యమకారులు బీజేపీలోకి రావాలని ఆయన కోరారు. బీజేపీ చేసే పోరాటంలో అందరూ భాగస్వాములై కేసీఆర్​కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇదే చివరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కావాలని సంజయ్​ ఆకాంక్షించారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్​ ఒక్కటే: సంకినేని

టీఆర్ఎస్, కాంగ్రెస్​ ఒక్కటే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్​రావు అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్​కు అమ్ముడుపోయారని, టీడీపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన రేవంత్​రెడ్డి నీతులు చెబుతున్నారని విమర్శించారు. పక్షవాతం వచ్చిన  కాంగ్రెస్​ను ఎవరూ లేపలేరని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​అడ్డగోలుగా ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు తదితరులు పాల్గొన్నారు.