ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ మంజూరు..

ఆర్టీసీ ఉద్యోగులకు  డీఏ మంజూరు..

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి పెండింగ్‌‌లో ఉన్న 5 శాతం డీఏను ఉద్యోగులకు మంజూరు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌‌‌‌ ప్రకటించారు.

ఈ నెల జీతానికి  డీఏ యాడ్ అవుతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ నష్టాలు, అప్పుల్లో ఉన్న ఇప్పటివరకు 8 డీఏలు ఇచ్చామని వెల్లడించారు. సంస్థ కోసం కార్మికులు, ఉద్యోగులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, వారి వల్లే రాఖీ పండుగ సందర్భంగా రెండ్రోజుల్లో రికార్డ్ స్థాయి రెవెన్యూ వచ్చిందని  చైర్మన్‌‌‌‌, ఎండీ ప్రశంసించారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న ఈ ఏడాది జులై డీఏను కూడా త్వరలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తాజా డీఏతో ఆర్టీసీకి ప్రతి నెల రూ.4 కోట్లు అదనపు భారం పడనుందని చెప్పారు.

పెండింగ్ డీఏ, బకాయిలు చెల్లించాలి.. 

ఉద్యోగులకు డీఏ విడుదలను స్వాగతిస్తున్నామని, అయితే డీఏ బకాయిలపై సంస్థ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని ఎప్‌‌‌‌డబ్ల్యూఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావులు తెలిపారు. విలీనం ప్రక్రియ ప్రారంభానికి ముందే డీఏలు, 168 నెలల డీఏ అరియర్స్ చెల్లించాలని ఆర్టీసీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. బకాయిలు చెల్లిస్తే ఒక్కో కార్మికుడికి రూ.1,60,00 వస్తాయని నేతలు పేర్కొన్నారు. డీఏ బకాయిలు రూ.750 కోట్లు ఉన్నాయని, వాటిని చెల్లించటంతో పాటు జులై డీఏను విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి డిమాండ్ చేశారు.