- రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
నిర్మల్, వెలుగు: రాష్ట్ర విత్తన సంస్థ పంపిణీ చేసే సీడ్స్ ను రైతులు వినియోగించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సూచించారు. సోమవారం నిర్మల్ కలెక్టరేట్ లో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, వారి ఉన్నతికి విత్తన సంస్థ పనిచేస్తోందని, ప్రభుత్వం తయారు చేసే విత్తనాలు రైతులు సాగు చేసేలా డీలర్లు ప్రచారం చేయాలని సూచించారు.
ఈ విత్తనాలు ధర తక్కువ అని, దిగుబడి కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. అనుమతులు లేని ప్రైవేట్ విత్తనాల కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, ఎక్కువ ధరకు అమ్ముతున్నాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. విత్తన సంస్థ విత్తనాలను సహకార సంఘాలు, మహిళా సంఘాలు రైతులకు అందించాలని సూచించారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజి ప్రసాద్, శ్రీధర్, డీఆర్డీవో విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
