సెక్రటేరియెట్​, అసెంబ్లీపై ఒకేసారి నివేదిక

సెక్రటేరియెట్​, అసెంబ్లీపై  ఒకేసారి నివేదిక

సెక్రటేరియెట్ కూల్చివేత, అసెంబ్లీ తరలింపునకు సంబంధించి టెక్నికల్ కమిటీ త్వరలో కేబినెట్​ సబ్​ కమిటీకి నివేదిక అందజేయనుంది. ముందుగా సెక్రటేరియట్ పై నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినప్పటికీ.. అసెంబ్లీ తరలింపుపై తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో టెక్నికల్ కమిటీ పునరాలోచనలో పడింది. అసెంబ్లీని తనిఖీ చేసిన తర్వాతే  రెండింటి నివేదికలను ఒకేసారి అందజేయాలని భావిస్తోంది.

సెక్రటేరియెట్ పరిశీలన పూర్తి
మంత్రులు ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, కొప్పుల ఈశ్వర్​ నేతృత్వంలోని కేబినేట్ సబ్ కమిటీ కొన్నిరోజుల క్రితం నలుగురు ఈఎన్సీలతో టెక్నికల్ కమిటీని నియమించింది. రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి కన్వీనర్ గా, మరో ముగ్గురు ఈఎన్సీలు రవీందర్ రావు, సత్యనారాయణరెడ్డి, మురళీధర్ రావు ఈ టెక్నికల్​ కమిటీలో ఉన్నారు. ఇటీవల సెక్రటేరియెట్ లోని అన్ని బ్లాకులను కమిటీ పరిశీలించింది. అనంతరం నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ , ఫైర్ సేఫ్టీల నుంచి నివేదికలను కోరింది. సెక్రటేరియెట్​లో భద్రతా పరంగా అన్ని అంశాలు కరెక్టుగా ఉన్నాయా.. ఫైరింజన్ తిరిగే ప్లేస్ ఉందా.. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగులను సురక్షితంగా రక్షించవచ్చా అన్న అంశాలపై ఫైర్ సేఫ్టీ నివేదిక సిద్ధం చేస్తోంది. భవనాల స్థితిగతులపై జేఎన్టీయూ ప్రొఫెసర్లు, భవన నిపుణుల నుంచి టెక్నికల్ కమిటీ నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలు తమకు అందిన తర్వాత టెక్నికల్ కమిటీ వాటిని అంచనా వేసి సెక్రటేరియెట్​కు సంబంధించి పూర్తి నివేదికను రూపొందించనుంది.

అసెంబ్లీ పరిశీలన తర్వాతే..
ప్రస్తుత అసెంబ్లీని కొనసాగించరాదనడానికి కేబినెట్​ముందున్న వివరాలు ఏంటీ? ఆర్ అండ్​ బీ నివేదిక ఇస్తే ప్రస్తుత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని అందులో ఉందా? అని గురువారం హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్నికల్​ కమిటీ నేడో రేపో అసెంబ్లీని పరిశీలించనున్నట్లు  తెలుస్తోంది. అసెంబ్లీ ప్రస్తుత పరిస్థితి, ఆ భవనం విలువ వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించనుంది. ఆ తర్వాతే సెక్రటేరియెట్, అసెంబ్లీకి సంబంధించి నివేదికను కేబినెట్​ సబ్​ కమిటీకి సమర్పించనుంది. ఇందు కోసం వారంరోజులు పట్టే అవకాశం ఉంది.