ఫార్ములా ఈ- రేస్‌‌‌‌ కేసులో అధికారుల ప్రాసిక్యూషన్కు విజిలెన్స్ ఓకే!

ఫార్ములా ఈ- రేస్‌‌‌‌ కేసులో అధికారుల ప్రాసిక్యూషన్కు విజిలెన్స్ ఓకే!
  • ఐఏఎస్​ అర్వింద్​ కుమార్, సీఈ బీఎల్‌‌‌‌ఎన్​ రెడ్డిపై 
  • న్యాయ విచారణ చేయాలని సర్కారుకు సిఫార్సు
  • ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్​ప్రాసిక్యూషన్​ ఫైల్​ గవర్నర్‌‌‌‌‌‌‌‌ 
  • వద్దనే పెండింగ్​ అనుమతి వచ్చాక చార్జిషీట్‌‌‌‌ వేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా ఈ రేస్‌‌‌‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడైన సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్ అర్వింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.  వీరిద్దరినీ ప్రాసిక్యూట్‌‌‌‌ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌.. ప్రజాప్రతినిధి కావడంతో ఆయన‌‌‌‌పై న్యాయవిచారణ అనుమతికి సంబంధించిన  ఫైల్ ఇంకా గవర్నర్‌‌‌‌‌‌‌‌ వద్ద పెండింగ్‌‌‌‌లో ఉంది. ప్రాసిక్యూషన్‌‌‌‌కు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్​రాసిన లేఖకు ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. 

కేటీఆర్ కేసుపై గవర్నర్ జిష్ణుదేవ్ మౌనం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1గా ఉన్న  కేటీఆర్‌‌‌‌, ఏ2 ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఏ3 హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌రెడ్డిను ప్రాసిక్యూట్‌‌‌‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 9న విజిలెన్స్ కమిషన్‌‌‌‌, సీఎస్‌‌‌‌కు ఏసీబీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేటీఆర్​పై న్యాయ విచారణకు అనుమతి కోరుతూ అదే రోజు గవర్నర్​కు సీఎస్​లేఖ రాయగా, అది పెండింగ్​లో ఉంది. కాగా, ఏసీబీ అందించిన రిపోర్ట్‌‌‌‌ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్‌‌‌‌.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించింది. వెయ్యికి పైగా డాక్యుమెంట్లు,78 పేజీలతో కూడిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రాసిక్యూషన్​కు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.  ఫార్ములా ఈ రేస్​ కేసులో ఏ2, ఏ3 నిందితుల ప్రాసిక్యూషన్​కు అనుమతిరావడంతో  ఏ1గా ఉన్న  కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై గవర్నర్‌‌‌‌ అనుమతి కోసం ఏసీబీ ఎదురుచూస్తున్నది. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

పక్కా ఆధారాలతో నివేదిక

ఫార్ములా ఈ రేస్‌‌‌‌ సీజన్‌‌‌‌ 9,10కి సంబంధించి రూ.58.89 కోట్లు హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధులు దుర్వినియోగంపై డిసెంబర్​19న ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ సహా సీనియర్ ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి, ఆర్గనైజర్‌‌‌‌‌‌‌‌ ఏస్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌జెన్‌‌‌‌కు చెందిన కిరణ్‌‌‌‌రావు, లండన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ ప్రతినిధులు సహా మొత్తం10 మందిని నిందితులుగా చేర్చింది. కేటీఆర్‌‌‌‌‌‌‌‌, అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డి సహా నిర్వాహకులు ఎఫ్‌‌‌‌ఈవో, ఏస్ నెక్స్ట్‌‌‌‌ జెన్‌‌‌‌ ప్రతినిధులను నిందితులుగా విచారించింది. 

వీరు వెల్లడించిన వివరాలతోపాటు ఏసీబీ సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో క్విడ్​ప్రోకో జరిగినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.58.89 కోట్లకు ప్రతిగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్‌‌‌‌ రూపంలో వచ్చినట్లు తేల్చింది. ఈ మొత్తం వ్యవహారానికి కేటీఆరే సూత్రధారి అని, ఆయన ఆ దేశాలను ఐఏఎస్ ​అర్వింద్​కుమార్, బీఎల్ఎన్​రెడ్డి అనుసరించారని స్పష్టం చేసింది. మంత్రి హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేటీఆర్ సహా ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్‌‌‌‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ లేఖ రాసింది. 8 నెలల దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్లతో కూడిన  రిపోర్ట్‌‌‌‌ను విజిలెన్స్ ​కమిషనర్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భాగంగానే తాజాగా విజిలెన్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ప్రాసిక్యూషన్‌‌‌‌కు అనుమతి ఇచ్చింది.