
హైదరాబాద్,వెలుగు: లైంగిక వేధింపులకు గురైన చిన్నారులు, మహిళలకు రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ మరిన్ని సదుపాయాలు కల్పించనుంది. ఆపదలో ఉన్న వారిని రక్షించడంతో పాటు బాధితులకు పునరావాసం, న్యాయ సహాయం అందించేందుకు బచ్‌పన్ బచావో ఆందోళన్‌తో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా బచ్‌పన్ బచావో ఆందోళన్(బీబీఏ)తో రెండోసారి ఎంఓయూను కుదుర్చుకుంది.లక్డీకాపూల్ లోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీజీ శిఖాగోయల్, బీబీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్ ఎంఓయూపై సోమవారం సంతకాలు చేశారు. డీఐజీ సుమతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లైంగిక, ఆన్‌లైన్ వేధింపులు, హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు తగిన న్యాయం అందించడం, వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచేలా కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి ఎంఓయూలోని ముఖ్యోద్దేశాలని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 220 మంది చిన్నారులను స్కూల్స్ లో చేర్చడం, 237 మంది మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద ఆర్థికసాయం అందించడం, 102 కుటుంబాలకు రేషన్‌కార్డులు వచ్చేలా చేయడంతో పాటు బాధితులకు రూ. 28.14 లక్షల పరిహారం ఇప్పించామని పేర్కొన్నారు.