పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ కిందకు వద్దు: రాష్ట్రాలు

పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ కిందకు వద్దు: రాష్ట్రాలు
  • ఇది టైమ్​ కాదని మేమూ భావించాం
  • జీఎస్టీ కౌన్సిల్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి నిర్మల వెల్లడి

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చబోవడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను రాష్ట్రాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకించాయని చెప్పారు. వాటిని జీఎస్టీలో చేర్చేందుకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించాం. కౌన్సిల్ అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేస్తాం” అని ఆమె చెప్పారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ పై జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ‘‘ఇది కొత్త పన్నేమీ కాదు. దీన్ని ఇప్పటిదాకా రెస్టారెంట్లు చెల్లించేవి. ఇకపై డెలివరీ యాప్ లు చెల్లిస్తాయి” అని పేర్కొంది. ఇకపై ప్లేస్ ఆఫ్ డెలివరీ వద్ద 5 శాతం జీఎస్టీని ఫుడ్ యాప్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. కొవిడ్ నేపథ్యంలో 2019 తర్వాత జీఎస్టీ కౌన్సిల్ భౌతికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కు జీఎస్టీ మినహాయింపు
‘‘కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ చాలా ఖరీదైనవి. జొల్గేన్స్ మా, విల్టెప్సో మందుల రేటు  రూ.16 కోట్లు. ఇలాంటి వాటికి జీఎస్టీ మినహాయింపులివ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది’’ అని నిర్మల వివరించారు. మస్క్యులర్ అట్రోఫీ చికిత్సలో వాడే మందులనూ కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు జీఎస్టీ నుంచి మినహాయించినట్టు చెప్పారు. ‌‌ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గిస్తూ, సరకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్‌ పర్మిట్‌ ఫీజులకు జీఎస్టీ మినహాయిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

బకాయిలు ఇవ్వండి: హరీశ్
హైదరాబాద్​: తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.210 కోట్లు రిలీజ్​ చేయాలని మంత్రి నిర్మలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు కోరారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన రూ.450 కోట్ల బీఆర్​జీఎఫ్​ ఫండ్స్​వెంటనే ఇవ్వాలన్నారు. 45వ జీఎస్టీ కౌన్సిల్​ భేటీలో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలకు ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. ‘‘2019లో కేంద్ర కన్సాలిడేట్​ఫండ్​కు బదిలీ చేసిన రాష్ట్రాల ఐజీఎస్టీని సెటిల్​ చేయాలి. రాష్ట్రంలో 32 వెనకబడ్డ జిల్లాలకు స్పెషల్​అసిస్టెన్స్​మరో ఐదేళ్లు కొనసాగించాలి. గత, ఈ ఆర్థిక సంవత్సర గ్రాంట్లను త్వరగా విడుదల చేయాలి. గత ఆర్థిక సంవత్సరం 15 వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ .723 కోట్ల ప్రత్యేక నిధి ఇవ్వాలి” అని కోరారు.