అంబేద్కర్, పూలే పాఠాలు చదవొద్దా?. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

అంబేద్కర్, పూలే పాఠాలు చదవొద్దా?. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
  • సర్కార్ తీరుపై దళితులు, గిరిజనులు, బీసీలు,స్టూడెంట్ యూనియన్ల ఫైర్
  • లెసెన్స్ తీసేయడంపై‘వెలుగు’లో కథనం వెనక్కి తగ్గిన ఇంటర్ బోర్డు
  • సిలబస్ తగ్గింపు కేవలం కమిటీసిఫారసులేనని ప్రకటన
  • ఇంటర్​ టెక్స్ట్​​బుక్స్​ నుంచి తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన

హైదరాబాద్, వెలుగు:మహనీయులు, సామాజిక ఉద్యమ కారుల చరిత్రను ఇంటర్ పుస్తకాల్లోంచి తొలగించే దుస్సాహసం నుంచి సర్కారు వెనక్కి తగ్గింది. అంబేద్కర్, పూలే తదితరుల పాఠాల తగ్గింపు అనేది కేవలం కమిటీ సిఫార్సు మాత్రమేనని ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్​తో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్​ సిలబస్​లో 30 శాతం వరకు తగ్గిస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అందులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, పెరియార్  రామస్వామి, నారాయణగురు వంటి సామాజిక ఉద్యమ కారుల చరిత్రను తొలగించటం వివాదాస్పదంగా మారింది. వీటితో పాటు గాంధీయిజం, సోషలిజం, కమ్యూనిజం, బుద్ధుని బోధనలు, ఆర్టీఐ తదితర కీలక అంశాలనూ ఇంటర్​ సిలబస్​ నుంచి తీసేశారు. దీనిపై ‘అంబేద్కర్, పూలే పాఠాలు తీసేసిన్రు’ అన్న శీర్షికతో బుధవారం ‘వెలుగు’ పత్రిక కథనం ప్రచురించింది. ఇది మహనీయులకు జరిగిన అవమానమేనని.. ఇందులో సామాజిక కుట్ర దాగి ఉందంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థి, దళిత, బహుజన సంఘాలు ఆందోళనకు దిగాయి. మేధావులు, ప్రొఫెసర్లు కూడా ఇంటర్​ బోర్డు చర్యపై మండిపడ్డారు.  దీంతో సర్కారు పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని.. ఇంటర్ బోర్డు అధికారులపై మండిపడ్డట్టు తెలిసింది. దీని ఎఫెక్ట్​తో బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్  వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులు అప్రూవ్  చేయకముందే కమిటీ ప్రపోజల్స్ బయటకు వచ్చాయని చెప్పుకొచ్చారు.

మహనీయుల జీవిత చరిత్రలను ఇంటర్​ సిలబస్ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. బుధవారం ఇంటర్ బోర్డు వద్ద ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్​కు వినతి పత్రం ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్, పూలే, పెరియార్ వంటి మహనీయుల చర్రితను తొలగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం హైదరాబాద్​లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కడతామంటూనే.. మరోవైపు ఆయన చరిత్ర తెలియకుండా చేస్తోందని తప్పుపట్టారు. సిటిజన్ షిప్, ఆర్టీఐ, సోషలిజం, కమ్యూనిజం, గాంధీయిజం అంశాలను కూడా తొలగించడం సరికాదన్నారు. దీనిపై సర్కారు వెనక్కి తగ్గకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తాటికొండ రవి, సిటీ ప్రెసిడెంట్, సెక్రెటరీలు అశోక్​ రెడ్డి, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఇక సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

ఉద్యమాలను  అణచే ధోరణిలో భాగమే..

సామాజిక, కుల ఉద్యమాలను అణచివేసే ధోరణిలో భాగంగానే మహనీయుల చరిత్రను తొలగించారు. అంబేద్కర్ వల్లనే 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతోంది. మహనీయుల, ఉద్యమకారుల పాఠాలను తీసివేయటం అంటే చరిత్రను, రిజర్వేషన్లను అణచివేయడమే.

‑ ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ​ అధ్యక్షుడు

సిలబస్ తగ్గింపు అంశం పరిశీలనలోనే ఉంది

ఇంటర్​ సిలబస్ తగ్గింపు అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. నేషనల్  హీరోలు, సామాజిక సంస్కర్తలు, ప్రముఖుల పాఠాలు తొలగించే ప్రశ్నే లేదన్నారు. ఈ మేరకు ‘అంబేద్కర్, పూలే పాఠాలు తీసేసిన్రు’ వార్తపై ఆయన వివరణ ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ తో 4 నెలల వర్కింగ్ డేస్ తగ్గడంతో.. సీబీఎస్​ ఈ సూచనతో సైన్స్, మ్యాథ్స్​లో 30% సిలబస్ తగ్గించామన్నారు. హ్యుమానిటీస్​ స్టేట్ సిలబస్​ కాబట్టి.. కమిటీ వేశామని, కొన్ని భాగాలను తగ్గించాలని కమిటీ సిఫార్సు చేసిందన్నారు. తగ్గించిన సిలబస్ ఈ ఏడాదికేనని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు చెప్పకముందే.. ప్రెస్​రిలీజ్ చేయడం అనాలోచితమే అన్నారు.

ఓయూలో బీఎస్ఎఫ్, బీవీఎస్​ నిరసన

కరోనా సాకుతో మహనీయుల పాఠాలను తొలగిస్తే ఊరుకునేది లేదని బహుజన విద్యార్థి సంఘాలు సర్కారును హెచ్చరించాయి. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్​కాలేజీ ముందు బీఎస్ఎఫ్, బీవీఎస్​ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సర్కారు తీరును బీఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, బీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులిగంటి వేణు తప్పుపట్టారు. పూలే, అంబేద్కర్, పెరియార్, బుద్ధిజం, కమ్యూనిజం, సోషలిజం పాఠాలను తొలగించవద్దని డిమాండ్​ చేశారు. బహుజన సంస్కృతి భవిష్యత్ తరాలకు తెలియవద్దనే సర్కారు ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహనీయుల చరిత్రను సిలబస్​లోంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ఇంటర్ బోర్డు వెనక్కి తీసుకోవాలని టీఎస్​టీటీఎఫ్​రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనుల పోరాట అంశాలను ఎత్తేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

సర్కారు తీరు సిగ్గుచేటు

ఇంటర్ పుస్తకాల్లో మహనీయుల చరిత్రను తొలగించడం దుర్మార్గమైన చర్య. ఇది పాలకుల బాధ్యతను తెలియజేస్తోంది. గిరిజన ఉద్యమాలనూ తీసివేయడం సిగ్గుచేటు.

– బెల్లయ్య నాయక్,ఏఐసీసీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్

ఇది ఏకపక్ష నిర్ణయం

సిలబస్ తగ్గింపు ఏకపక్ష నిర్ణయం. తగ్గించే పాఠాల ప్రాధాన్యతను చూడాల్సిన ఇంటర్ బోర్డు ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. నిజంగానే బోర్డు సెక్రెటరీకి తెలియకుండా.. తగ్గించిన సిలబస్​వివరాలు బయటకొస్తే, కారకులపై చర్యలు తీసుకోవాలి.

– మధుసూదన్​రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్

ఈ తీరు సరికాదు

బోధనా అంశాలను తగ్గించడాన్ని స్వాగతిస్తున్నం. కానీ పలు సబ్జెక్టుల్లో విశిష్టమైన బోధనాంశాలను తీసేయడం లెక్చరర్లనే ఆశ్చర్యానికి గురిచేసింది. కమిటీ వెంటనే ఆలోచించి మహనీయుల చరిత్ర, ముఖ్యమైన పాఠాలను కొనసాగించాలి.

– శ్రీనివాస్​రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్స్​యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఇది దుర్మార్గమైన చర్య

అంబేద్కర్, పూలే వంటి ఉద్యమకారుల జీవిత ఘట్టాలు రాబోయే తరాలకు తెలియజెప్పే అవసరం ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. దానిపై విద్యా శాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కమిషనర్​కు నోటీసులు జారీ చేస్తం.

– ఆచారి, జాతీయ బీసీ కమిషన్ మెంబర్

మహనీయుల చరిత్ర తొలగించడం దారుణం

మహనీయుల చరిత్ర స్టూడెంట్స్​కు అందకుండా కుట్ర జరుగుతోంది. అంబేద్కర్, పూలే లాంటి మహనీయుల పాఠాలను ఇష్టానుసారంగా తొలగించడం దుర్మార్గం. విదేశీ భావజాల కమ్యూనిజాన్ని తొలగించడాన్ని స్వాగతిస్తున్నం.

– పగిడిపల్లి శ్రీహరి, ఏబీవీపీ నేత