- 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ప్రజాపాలన–-ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా వచ్చే నెల 2న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రణాళికశాఖ సోమవారం జారీ చేసింది.
సర్పంచ్ అధ్యక్షతన జరిగే ఈ సభల్లో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, మహిళా సంఘాలు ప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది.
జిల్లాల వారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందస్తుగా సమాచారం ఇచ్చి వారిని భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించింది. 2న ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభించాలని ఆదేశించింది. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించింది. అనంతరం సీఎం సందేశాన్ని చదివి వినిపించనున్నారు. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల జాబితాలను సభలో చదివి వినిపించాలని, లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని పేర్కొంది.
