
- కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టేటస్ రిపోర్టు
- దేశం దృష్టిని ఆకర్షిస్తున్న మెగా ప్రాజెక్టు
- ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు
- ప్రస్తుతం మేడిగడ్డ వద్ద డెడ్ స్టోరే జీ
- ఎగువన భారీ వర్షాలు కురిసి వరద వస్తేనే ఎక్కువ ఫాయిదా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:గోదావరి నీటితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు శరవేగంగా పూర్తయింది. దేశమందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఈ నెల 21న ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. కేవలం మూడేళ్లలోనే రూ.80 వేల కోట్లతో కాళేశ్వరాన్ని ఆవిష్కరించిన తీరు ఇరిగేషన్ రంగంలో అద్భుతమే. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును ‘వెలుగు’ శుక్రవారం సందర్శించింది. గోదావరికి అడ్డంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నీటిని వినియోగించుకునే వీలుంది.. అక్కడెంత నీటి లభ్యత ఉంది.. భారీ వర్షాలు, వరదలొస్తే ఎంత నీటిని ఎత్తిపోయచ్చు.. అక్కడున్న లేటెస్ట్ సీన్ ఏమిటన్నదానిపై ‘వెలుగు’ స్టేటస్ రిపోర్ట్ …
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోయాలనేది ప్లాన్. రోజూ ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసేందుకు వీలుగా మోటార్ల బిగింపు పూర్తయింది. గోదావరిపై రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసే డిజైన్‌కు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ మూడు చోట్ల గోదావరిలో నీటి నిల్వలు లేవు. మేడిగడ్డ వద్ద డెడ్ స్టోరేజీ కన్పిస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి వరద వస్తేనే ఇక్కడ మోటార్లు రన్ అయ్యే పరిస్థితి ఉంది. ఎగువన వర్షాలు కురిసి గోదావరి, ప్రాణహిత నదుల్లో తగినంత నీటి లభ్యత ఉంటే.. వానా కాలంలో 90 రోజులపాటు ఏకధాటిగా పంపింగ్ చేసే వీలుందని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. అందులో 40 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 16 టీఎంసీలు పరిశ్రమలకు కావాలి. ఇవి పోను మిగిలిన 34 టీఎంసీలు సాగునీరు. ఒక టీఎంసీ గరిష్ఠంగా 15 వేల ఎకరాలకు సాగునీటిని అందించినా.. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
వరద నీటి కోసమే..
ఏటా జూన్ 1 నుంచి మే 31 మధ్య కాలంలో మేడిగడ్డ వద్ద గోదావరిలో దాదాపు 1500 టీఎంసీల నీళ్లు దిగువకు వృథాగా పోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏటా జూన్‌లో 50 నుంచి 60 టీఎంసీలు, జులైలో 400 టీఎంసీలు, ఆగస్టులో 600 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 300 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఇంజినీరింగ్ శాఖ అంచనాలున్నాయి. నాలుగు నెలల్లో సాధ్యమైనంత నీటిని ఎత్తిపోయాలనేది టార్గెట్. ఇందులో ఎక్కువ శాతం నీళ్లు ప్రాణహితవే. వీటిని ఒడిసిపట్టి రాష్ట్ర అవసరాల కోసం తాగు, సాగు నీరుగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మేడిగడ్డ వద్ద 1632 మీటర్ల పొడువున 85 గేట్లతో బ్యారేజీ నిర్మించారు. పనులు చివరి దశలో ఉన్నాయి. వానలు పడితే ఇక్కడి గేట్లు వేసి ఆగిన నీళ్లను.. కన్నెపల్లి వద్ద మోటార్లతో పంపింగ్ చేసి అన్నారం బ్యారేజీలోకి నింపుతారు. అన్ని గేట్లను వేసి ఉంచితే 16.17 టీఎంసీల నీటికి ఇక్కడ నిల్వ చేసే వీలుంటుంది. ఇప్పుడు ఇక్కడ గోదావరి వెలవెలబోతోంది. డెడ్ స్టోరేజీ వరకే నీళ్లున్నాయి. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి వరద వస్తేనే ఇక్కడ నీరు ఆగుతుంది.
కాపర్ డ్యామ్పైనే ఆధారం
మేడిగడ్డ బ్యారేజీ నుంచి 12 కి.మీ దూరం ఎగువన కన్నెపల్లి పంప్‌హౌజ్ నిర్మించారు. డిజైన్ ప్రకారం రోజుకు రెండు టీఎంసీల నీరు లిఫ్ట్ చేసేందుకు 11 మోటార్లు అమర్చాలి. ఇప్పటివరకు తొమ్మిది మోటార్లు రెడీ అయ్యాయి. ఈ పంప్‌హౌజ్‌కు సమీపంలో ప్రాణహిత గోదావరితో కలుస్తుంది. ఇక్కడే గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా 30 మీటర్ల లోతులో ఫోర్ బే నిర్మించారు. దీంతో వరద నీరు నేరుగా హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి చేరుతుంది. ఇక్కడ 93.5 మీటర్ల మేరకు నీరు అందుబాటులో ఉంటేనే మోటార్లు స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి లభ్యత కష్టంగా కనిపిస్తోంది. ప్రాణహిత నుంచి వరద రాకుంటే ఇప్పుడున్న నీటితో మోటార్లు రన్ చేయడం చాలా కష్టమని ఇంజనీర్లు చెప్తున్నారు. రెండు మోటార్లను ఆన్ చేసినా కొద్ది సేపటికే నీరు అయిపోయి మోటార్లు బంద్ చేయాల్సి వస్తోంది. ఇది గుర్తించిన అధికారులు కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో కిలోమీటర్ పొడవున కాపర్ డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. ఈ పనులు కూడా జరుగుతున్నాయి. జూన్‌లో ఓ మోస్తరు వర్షాలు కురిసినా ప్రాణహిత నదిలో ఉండే నీటి ప్రవాహాన్ని ఈ కాపర్‌డ్యాం ఆధారంగా ఆపేసి పంప్‌హౌస్ వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా వరద నీరుంటే మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా ఇక్కడి నుంచే నీటిని లిఫ్ట్ చేసుకునే వీలుంది. వరద నీరు తక్కువగా ఉంటే మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆగిన నీటిని మాత్రమే పంపింగ్ చేసుకోవచ్చు.
గ్రావిటీ కెనాల్
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేసే నీటిని అన్నారం తీసుకెళ్లడానికి వీలుగా 13.8 కి.మీ గ్రావిటీ కెనాల్ నిర్మాణం పూర్తయింది. పంప్‌హస్ నుంచి పైప్‌లైన్లతో వచ్చే నీరు ఈ కెనాల్‌లో పడుతుంది. రోజుకు 3 టీఎంసీల నీరు తీసుకెళ్లేంత వెడల్పుతో కాల్వ నిర్మించారు. కన్నెపల్లి నుంచి అన్నారం వరకు కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఈ కాల్వపై 13 చోట్ల వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం రెండు వైపులా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అన్నారం బ్యారేజీ
మేడిగడ్డ బ్యారేజీ నుంచి 25 కి.మీ దూరంలో ఎగువన గోదావరి నదిపై 66 గేట్లతో అన్నారం బ్యారేజీ నిర్మించారు. నాలుగు నెలల క్రితమే బ్యారేజీ పనులు, గేట్ల బిగింపు పూర్తయ్యాయి. అన్నారం పంప్‌హౌస్ వద్ద ఎనిమిది మోటార్లు బిగించాల్సి ఉండగా ఐదు రెడీ అయ్యాయి. ఇక్కడా నీటి చుక్క లేదు. అన్నారం పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల దాకా రెండు కి.మీ. గ్రావిటీ కెనాల్ నిర్మించారు. ఇక్కడ మోటార్లను రన్ చేసి కెనాల్‌లో పోస్తే నేరుగా సుందిళ్లలో కలుస్తాయి.
సుందిళ్ల బ్యారేజీ
అన్నారం నుంచి సుమారు 20 కి.మీ ఎగువన గోదావరి నదిపై 74 గేట్లతో సుందిళ్ల బ్యారేజీ నిర్మించారు. గేట్ల బిగింపు పనులన్నీపూర్తయ్యాయి. తొలి దశలో ఆరు మోటార్లు బిగించారు. మరో మూడు రావాల్సి ఉంది. ఇక్కడ నీరు డెడ్ స్టోరేజీలోనే ఉంది. వెట్‌రన్ కూడా కష్టమేనని ఇంజనీర్లు చెప్తున్నారు. గోదావరి ఉప్పొంగితే రివర్స్ పంపింగ్ అవసరం ఉండదు. ఎల్లంపల్లి నిండగానే గేట్లు తెరిస్తే నేరుగా సుందిళ్ల బ్యారేజీలోకి నీళ్లు వస్తాయి. ఇక్కడ గేట్లు వేస్తే 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. సుందిళ్ల పంప్‌హౌస్ నుంచి ఎల్లంపల్లి వరకు రెండు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ నిర్మించారు. ఇక్కడ మోటార్లు రన్ చేస్తే నీళ్లు నేరుగా ఎల్లంపల్లి బ్యారేజీలో కలుస్తాయి. గోదావరిలో నీటి ఉధృతి లేకపోతే మేడిగడ్డ నుంచి అన్నారం… అన్నారం నుంచి సుందిళ్లకు రివర్స్ పంపింగ్ చేయాల్సిందే.