రోజుకు 9 గంటల కంటే ఎక్కువసేపు ఆఫీసులోనే

రోజుకు 9 గంటల కంటే ఎక్కువసేపు ఆఫీసులోనే
  • రోజుకు 9 గంటలపైనే పని..
  • ప్రతి 10 మందిలో ఆరుగురికి ఇదే పరిస్థితి
  • గోద్రెజ్ ఇంటీరియో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఉద్యోగులకు పని భారం పెరుగుతోంది. మనదేశంలో దాదాపు 64శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల్లో రోజుకు తొమ్మిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారని తాజా సర్వేలో తేలింది. గోద్రెజ్ ఇంటీరియో  వర్క్‌‌ప్లేస్  ఎర్గోనామిక్స్ రీసెర్చ్ సెల్ ద్వారా 'ఇట్స్ టైమ్ టు స్విచ్' అనే పేరుతో నిర్వహించిన స్టడీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫీసుల్లో పనిచేసేవారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి సమాచారం సేకరించింది. పనిలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు అనుసరించిన పద్ధతులను తెలుసుకోవడానికి 500 మంది నుంచి వివరాలు తీసుకుంది. ‘ఇప్పుడు ఉన్నదానికంటే వేరే విధంగా ఏమైనా చేయగలరా ?’ అన్న ప్రశ్నకు  73శాతం మంది ఉద్యోగులు ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అయితే 27శాతం మంది మాత్రమే వేరే విధంగా కూర్చోవడానికి ప్రయత్నించామని చెప్పారు. ఈ సమస్యలకు మూల కారణం ఎంప్లాయీస్ తమ వర్క్ డెస్క్‌‌ల వద్ద లేదా మీటింగులలో ఒకే భంగిమలో ఎక్కువ గంటలు కూర్చోవడమే!  ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుందని, ఫలితంగా కండరాల ( మస్క్యులోస్కెలెటల్) సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఎక్కువసేపు నిలబడటం కూడా మంచిదికాదని స్పష్టం చేశారు. కాసేపు నిలబడటం, కాసేపు కూర్చోవడం వల్ల  శరీరంపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ పద్ధతి అనుసరించడం వల్ల మరింత బాగా పనిచేయవచ్చని, రోజంతా శరీరం ఉల్లాసంగా ఉంటుందని సర్వే వివరించింది. “కరోనా మహమ్మారి మనం పని చేసే విధానాన్ని మార్చడానికి టెక్నాలజీలను తీసుకొచ్చింది.  అయినప్పటికీ, చాలా మంది కూర్చొనే ఉంటున్నారు. బద్ధకాన్ని వదలడం లేదు. మా ఉద్యోగులకు ఇటువంటి పరిస్థితి లేకుండా చూస్తున్నాం. కూర్చొనే పద్ధతులను మార్చాలని చెబుతున్నాం’’అని  గోద్రెజ్ ఇంటీరియో మార్కెటింగ్ (బీ2బీ) అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ జోషి అన్నారు.