గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్కు ప్రతిపాదనలు..కలెక్టర్ నుంచి సీడీఎంఏకు వినతి

గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్కు ప్రతిపాదనలు..కలెక్టర్ నుంచి సీడీఎంఏకు వినతి
  • పెరగనున్న వార్డుల సంఖ్య
  • మారనున్న గజ్వేల్ మున్సిపల్ గ్రేడ్

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేయడంతో వార్డుల పునర్విభజన తప్పనిసరిగా మారింది. ఇటీవల రాష్ట్రంలో 27 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పొరేషన్లలో వార్డుల డీ లిమిటేషన్ పూర్తి చేసినా ఈ జాబితాలో గజ్వేల్ మున్సిపాలిటీకి స్థానం దక్కలేదు. ఈ విషయంపై ఇటీవల మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ ద్వారా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ చేయాల్సి ఉండడంతో వాటితో పాటు గజ్వేల్ మున్సిపాలిటీలో సైతం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

పెరగనున్న వార్డుల సంఖ్య

ప్రస్తుతం గజ్వేల్​మున్సిపాలిటీలో 20 వార్డులుండగా డీ లిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తే 30 వార్డులకు పెరిగే అవకాశం ఉంది. ఆర్అండ్ఆర్ కాలనీలో దాదాపు 15 వేలకు పైగా జనం నివసిస్తుండగా పదివేల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1500 మందికి ఒక వార్డును ఏర్పాటు చేస్తే 30 వార్డులు ఏర్పడే అవకాశం ఉంది. గజ్వేల్ పట్టణంతో పాటు ప్రజ్ఞాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, క్యాసారం, ముట్రాజ్ పల్లి గ్రామాల్లో దాదాపు 50 వేల పై చిలుకు జనాభా ఉండగా  ఆర్ అండ్ ఆర్ కాలనీలోని 7 ముంపు గ్రామాలను కలుపుకుంటే గజ్వేల్ మున్సిపాలిటీ జనాభా 70 వేలకు చేరుతుంది. దీంతో గజ్వేల్ మున్సిపాలిటీ గ్రేడ్ 2 గా అవతరించే అవకాశం ఉంది. 

ఆశావహుల  ఎదురుచూపులు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహులు డీ లిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వార్డుల డీ లిమిటేషన్ జరిగితే తమకు అనుకూలమైన వార్డును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీపై పట్టు సాధించాలని  కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ  నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే  తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై  కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల డీ లిమిటేషన్ చేయాని కోరుతూ కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు ప్రతిపాదనలను పంపాం. అక్కడి నుంచి ఆదేశాలు వస్తే వెంటనే వార్డుల డీ లిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తాం. ‌‌   –బాలకృష్ణ, గజ్వేల్​ మున్సిపల్ కమిషనర్