WTC FINAL: లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆల్ టైమ్ రికార్డ్ సమం చేసిన స్టీవ్ స్మిత్

WTC FINAL: లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆల్ టైమ్ రికార్డ్ సమం చేసిన స్టీవ్ స్మిత్

లండన్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా తరుఫున అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా ఆసీస్ లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు. ఇంగ్లాండ్‎లోని లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ద్వారా స్మిత్ ఈ ఫీట్ నెలకొల్పాడు.

రికీ పాంటింగ్ ఆసీస్ తరుఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 6 ఐసీసీ ఫైనల్స్ ఆడాడు. స్మిత్ ఇప్పటి వరకు 5 ఐసీసీ ఫైనల్స్ ఆడి రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా రికీ పాంటింగ్ రికార్డును స్మిత్ సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు ఆడిన ఐదు ఐసీసీ ఫైనల్స్‌లో నాలుగు గెలిచాడు. రికీ పాంటింగ్ ఆరు ఫైనల్స్ ఆడి.. ఐదింట్లో విజయం సాధించాడు. ఇందులో ఎక్కువగా అతడి కెప్టెన్సీ చేసినవే ఉన్నాయి. 

ALSO READ | WTC ఫైనల్‎లో దుమ్మురేపుతోన్న రబాడ.. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఓవరాల్‎గా అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటి వరకు 9 ఐసీసీ ఫైనల్స్ ఆడారు. 8 ఐసీసీ ఫైనల్స్ ఆడి టీమిండియా ఆల్ రౌండర్ జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 7 ఐసీసీ ఫైనల్స్‎లో ఆడి అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన జాబితాలో థర్డ్ ప్లేస్‎లో కొనసాగుతున్నాడు. 

ఓవరాల్‎గా అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జాబితాలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ టాప్ ప్లేసులో ఉన్నాడు. పాంటింగ్ ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాడు. గిల్ క్రిస్ట్, మెక్ గ్రాత్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, రోహిత్ శర్మ 4 ఐసీసీ ట్రోఫీలు సాధించి ఈ జాబితాలో సెకండ్ ప్లేసులో కొనసాగుతున్నారు.