మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ పనులు

మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ పనులు
  • అందుకు 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ'ల ఏర్పాటు
  • కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నట్లు సీఎస్​ శాంతి కుమారి వెల్లడించారు.  ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరిట మహిళా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తాయని తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో  అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టు పనులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగిస్తున్నట్టు సీఎస్ స్పష్టం చేశారు. కమిటీల పనితీరు, స్కూల్ స్టూడెంట్ల యూనిఫామ్స్ స్టిచ్చింగ్ తదితర అంశాలపై  కలెక్టర్లతో గురువారం సాయంత్రం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా  సీఎస్ మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ల యూనిఫామ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ స్కూల్స్, సంక్షేమ హాస్టళ్ల పిల్లల స్కూల్ యూనిఫామ్ లను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 63,44,985 జతల స్కూల్ యూనిఫామ్ లు స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం స్కూల్స్ తెరిచేలోగా యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కమిటీలకు విలేజ్ ఆర్గనైజేషన్ లేదా ఏరియా లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షలు చైర్ పర్సన్ గా, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని సీఎస్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ లో  విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.