ములుగు జిల్లాలో జోరువాన..స్కూళ్లకు సెలవు

ములుగు జిల్లాలో జోరువాన..స్కూళ్లకు సెలవు

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు తెగిపోయాయి. పంటలపొలాలునీటమునిగాయి.పలు చోట్లు ఇళ్లు కూలిపోయాయి. 

ములుగు జిల్లాలో సోమవారం (ఆగస్టు18) భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో వెంకటాపురం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో రకపోకలకు అంతరాయం ఏర్పడి  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రహారీ గోడలు కూలిపోయాయి. 

వెంకటాపురం మండలంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో పంట నీటమునిగింది. పూసూరు బ్రిడ్జి దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

ములుగు జిల్లాలో మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని అధికారులు ప్రజలను అలెర్ట్ చేశారు.  ముంపు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. మరోవైపు లక్నవరం చెరువుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో లక్నవరం మత్తడి దుంకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. 

జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు కలెక్టర్ అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు ఉన్నందున పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా సెప్టెంబర్ నెలలో వచ్చే రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ లో  జరగాల్సిన ప్రజావాణి రద్దు చేశారు.