మార్కెట్‌‌లో అమ్మకాల ఒత్తిడి

మార్కెట్‌‌లో అమ్మకాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్‌‌ వరసగా రెండో సెషన్‌‌లోనూ తీవ్రంగా నష్టపోయింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు ఒకవైపు, పెరుగుతున్న డాలర్ విలువ, బాండ్‌‌ ఈల్డ్‌‌లు మరోవైపు..దీంతో దేశ మార్కెట్‌‌లోనూ సోమవారం అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  కిందటి వారం 18 వేల లెవెల్‌‌ వరకు వెళ్లిన నిఫ్టీ శుక్రవారం, సోమవారం సెషన్లను కలిపి ఏకంగా 500 పాయింట్లు నష్టపోయింది.  సెన్సెక్స్ ఈ రెండు సెషన్లలో 1,500 పాయింట్లు తగ్గింది. గ్లోబల్‌‌ మార్కెట్‌‌ల నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో సెన్సెక్స్‌‌ సోమవారం 872 పాయింట్లు (1.46 శాతం) తగ్గి 58,774 పాయింట్ల వద్ద, నిఫ్టీ  268 పాయింట్లు నష్టపోయి 17,491 వద్ద ముగిశాయి.  యూకే,  యూరప్‌‌లో ఇన్‌‌ఫ్లేషన్ రికార్డ్‌‌ లెవెల్‌‌కు చేరుకోవడం, చైనాలో నెలకొన్న  హౌసింగ్ సంక్షోభం, కరోనా సమస్యలు, పవర్‌‌‌‌ షార్టేజ్ వంటి అంశాలు, యూఎస్‌‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు..మార్కెట్‌‌ను కిందకు లాగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. షార్ట్‌‌టెర్మ్‌‌లో మార్కెట్‌‌ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌‌లో కొనుగోలు జరపడం మంచి విషయమేనని, కానీ, డాలర్ వాల్యూ పెరుగుతుండడంతో  గతంలో మాదిరి వీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం లేదని పేర్కొన్నారు.  మరోవైపు  గ్లోబల్‌‌ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ వాల్యూ సోమవారం 108 లెవెల్‌‌కు చేరుకుంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌‌ 2.99 శాతానికి పెరిగింది.  గ్లోబల్‌‌ ఎకనామీ స్లోడౌన్‌‌లో ఉన్నా, దేశంలో ఎకానమీ ఇండికేటర్లు సానుకూలంగా నమోదవుతుండడంతో విదేశీ ఇన్వెస్టర్లు  దేశ మార్కెట్ల వైపు మరింతగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని విజయకుమార్ పేర్కొన్నారు.  కానీ, పెరుగుతున్న డాలర్ వాల్యూ, బాండ్ ఈల్డ్‌‌లు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని వివరించారు. మీడియం నుంచి లాంగ్ టెర్మ్‌‌ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు క్వాలిటీ బ్యాంక్ షేర్లు పడినప్పుడు కొనుక్కోవాలని సలహాయిచ్చారు. 

రెండు రోజుల్లో రూ.6.5 లక్షల కోట్లు డౌన్‌‌!
ఇన్వెస్టర్ల సంపద గత రెండు సెషన్లలో రూ. 6.5 లక్షల కోట్లు తగ్గింది.  కిందటి వారం రూ. 280 లక్షల కోట్ల వద్ద ఆల్‌‌టైమ్ హైని టచ్ చేసిన బీఎస్‌‌ఈలోని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్,  ప్రస్తుతం  రూ. 274.02 లక్షల కోట్లకు తగ్గింది.  ఈ రెండు సెషన్ల కంటే ముందు బెంచ్‌‌ మార్క్‌‌ ఇండెక్స్‌‌లు తమ జూన్ కనిష్టాల నుంచి 18 శాతానికి పైగా లాభపడిన విషయం తెలిసిందే. ఈ టైమ్‌‌లో ఇన్వెస్టర్ల సంపద ఆగకుండా రూ. 45 లక్షల కోట్లు పెరగడం గమనించాలి. దీంతో తాజాగా జరుగుతున్న మార్కెట్ కరెక్షన్ మంచిదేనని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు.  మార్కెట్‌‌లు జూన్ కనిష్టాల నుంచి వరస సెషన్లలో ర్యాలీ చేయడంతో డైలీ చార్ట్‌‌లో ఆర్‌‌‌‌ఎస్‌‌ఐ (ఒక టెక్నికల్ ఇండికేటర్‌‌‌‌) వాల్యూ 84 కు చేరుకుందని, ఇది ఓవర్ బాట్ జోన్‌‌ను సూచిస్తోందని ఐఐఎఫ్‌‌ఎల్‌‌ సెక్యూరిటీస్‌‌ సీఈఓ (రిటైల్ బ్రోకింగ్‌‌) సందీప్ భరద్వాజ్‌‌ అన్నారు. క్వాలిటీ షేర్లను కొనుక్కోవడానికి తాజా కరెక్షన్‌‌ను అవకాశంగా చూసుకోవాలని సలహాయిచ్చారు. ఎఫ్‌‌ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ. 18,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అంతకు ముందు 10 నెలల్లో వీరు నికర అమ్మకం దారులుగా ఉన్నారు.

మరిన్ని మార్కెట్ అంశాలు..
జాక్సన్‌‌ హోల్‌‌ సింపోజియం ఈ నెల 25–27 మధ్య జరగనుంది. సెప్టెంబర్ మీటింగ్‌‌లో వడ్డీ రేట్ల పెంపు ఎంత ఉంటుందనే సంకేతాలను  ఈ సింపోజియంలో యూఎస్ ఫెడ్ చైర్మన్  జెరోమ్ పావెల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఈసారి పాలసీ మీటింగ్‌‌లో  50 బేసిస్ పాయింట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందనే అంచనాలు  కిందటి వారం వరకు ఉన్నాయి. కానీ, తాజాగా విడుదల చేసిన ఫెడ్  పాలసీ మినిట్స్ ప్రకారం  75 బేసిస్ పాయింట్ల పెంపు కూడా ఉండొచ్చనే భయాలు పెరిగాయి.  దీంతో డాలర్ బలపడుతోంది. బాండ్ ఈల్డ్‌‌లు పెరుగుతున్నాయి. దేశ మార్కెట్‌‌లు హై లెవెల్‌‌లో ఉండడంతో తాజా కరెక్షన్‌‌ కనిపిస్తోంది. ఈ నెల 25 న ఆగస్టు డెరివేటివ్‌‌ల ఎక్స్‌‌పైరి ఉంది. ఈ ఎక్స్‌‌పైరి డేట్‌‌కు ముందు మార్కెట్‌‌లో కరెక్షన్ చూస్తున్నాం. పెద్ద ఇన్వెస్టర్లు మంత్లీ ఎక్స్‌‌పైరి ముందు తమ పొజిషన్లను క్లోజ్ చేసుకుంటున్నారని, ప్రాఫిట్స్‌‌ బుక్ చేసుకుంటున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. నిఫ్టీ 17,500 లెవెల్‌‌ వరకు ప్రాఫిట్‌‌ బుకింగ్‌‌ జరగొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌‌  ఎనలిస్ట్‌‌ రాజ్‌‌ దీపక్ సింగ్‌‌ వీక్లీ నోట్‌‌లో పేర్కొన్నారు.