సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% డౌన్..ఫార్మా, ఐటీ షేర్ల అమ్మకాలతో నష్టాలు

సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1%  డౌన్..ఫార్మా, ఐటీ షేర్ల అమ్మకాలతో నష్టాలు

ముంబై: అమెరికా వచ్చే నెల నుంచి  బ్రాండెడ్ డ్రగ్స్​పై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో దేశీయ స్టాక్​మార్కెట్లు కుదేలయ్యాయి.  ఫార్మా, ఐటీ షేర్లలో భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్,​ నిఫ్టీ వరుసగా ఆరో రోజు కూడా దాదాపు ఒక శాతం తగ్గాయి. సెన్సెక్స్​ 733.22 పాయింట్లు తగ్గి మూడు వారాల కనిష్ట స్థాయి 80,426.46 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 827.27 పాయింట్లు పడిపోయింది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 236.15 పాయింట్లు (0.95 శాతం) తగ్గి మూడు వారాల కనిష్ట స్థాయి 24,654.70కు చేరింది. 

సెప్టెంబర్ 19 నుంచి ఈ ఇండెక్స్​ ఆరు వరుస సెషన్లలో 3 శాతం పతనమైంది. సెన్సెక్స్​ ఆరు సెషన్లలో 2,587.50 పాయింట్లు (3.16) శాతం తగ్గింది. వచ్చే నెల నుంచి బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 100 శాతం దిగుమతి సుంకాలను ట్రంప్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలా ఫార్మా షేర్లు పతనమయ్యాయి. 

బీఎస్​ఈ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఇండెక్స్​2.14 శాతం నష్టపోయింది. వాక్​హార్ట్ షేర్లు 9.4 శాతం తగ్గాయి. లారస్ ల్యాబ్స్, బయోకాన్, జైడస్ లైఫ్, గ్లెన్​మార్క్, సన్​ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ షేర్లు తగ్గాయి. సెన్సెక్స్​ కంపెనీలలో మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎటర్నల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్ నష్టపోయాయి.  లార్సెన్ అండ్ టూబ్రో, టాటా మోటార్స్, ఐటీసీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. 

ఇండెక్స్‎లకు నష్టాలే

బీఎస్​ఈ స్మాల్‌‌‌ క్యాప్ ఇండెక్స్​ 2.05 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్​ 1.96 శాతం తగ్గాయి. అన్ని సెక్టోరల్​ ఇండెక్స్​లు పడ్డాయి. టెలికం 2.69 శాతం, బీఎస్​ఈ ఫోకస్డ్​ ఐటీ 2.43 శాతం, ఐటీ 2.41 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.34 శాతం, టెక్ 2.03 శాతం, కమోడిటీస్ 1.91 శాతం, మెటల్ 1.90 శాతం, సర్వీసెస్ 1.73 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ 1.70 శాతం పడిపోయాయి. బీఎస్​ఈలో 3,100 స్టాక్స్ తగ్గగా, 1,041 లాభపడ్డాయి . గత గురువారం నుంచి బీఎస్​ఈ బెంచ్​మార్క్ 2,587.5 పాయింట్లు,   నిఫ్టీ 768.9 పాయింట్లు పతనమైంది.

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్​, షాంఘై ఎస్ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్​, హాంకాంగ్ హాంగ్ సెంగ్ భారీగా తగ్గాయి. యూరప్​ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్​గా ట్రేడ్ అవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు తగ్గాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు గురువారం రూ. 4,995.42 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.27 శాతం తగ్గి బ్యారెల్ 69.23 డాలర్లకు చేరింది.