ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి

 ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి
  •  ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు
  • 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో జీహెచ్ఎంసీ ఆఫీసర్లు150 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని కూడా ఇక్కడే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పచ్చని ప్రదేశంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ10 గ్రామాల ప్రజలు అడ్డుపడుతున్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలోనే డంపింగ్​యార్డ్​ కోసం ప్యారానగర్ లో 150 ఎకరాలు కేటాయించారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించారు కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కొన్నేళ్లు ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం మళ్లీ ప్యారానగర్ లో డంపింగ్ యార్డ్ కోసం భూకేటాయింపునకు సిద్దమైంది. ఆ టైంలో దాదాపు పది గ్రామపంచాయతీలు డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందజేశాయి.

దీంతో నిర్మాణ విషయంలో ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో యార్డ్ నిర్మించే స్థలానికి వెళ్లడానికి రోడ్డు వేసేందుకు రాష్ట్ర అటవీశాఖ 0.65 హెక్టార్ల భూమిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఇందుకోసం అటవీ శాఖకు జీహెచ్ఎంసీ రూ.60 లక్షలు చెల్లించినట్లు ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ చెత్త నుంచి విద్యుత్ ను మాత్రమే తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నప్పటికీ జవహర్ నగర్ లోనే చెత్తను సేగ్రిగేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే చెత్త వ్యర్ధాలను మాత్రమే ప్యారానగర్ కు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

పర్యావరణానికి ముప్పు

గుమ్మడిదల మండలంలో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. ఇక్కడ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. పచ్చటి పొలాల మధ్య అధికారులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దుర్వాసన, కాలుష్యం కారణంగా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు.

భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయ భూములు పంటలకు పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భూముల ధరలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.  అందుకే అధికారులు ఇప్పటికైనా ఆలోచించి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపాలని కోరుతున్నారు.

ఎవుసం ఇడిసి పోవాలి

డంపింగ్ యార్డ్ నిర్మిస్తే 10 ఊర్ల రైతులకు వ్యవసాయం దూరమైతది. అదే జరిగితే ఎవుసం ఇడిసిపెట్టి బతుకుదెరువు కోసం వలస పోవాల్సిందే. హైదరాబాద్ లో సేకరించిన చెత్త మొత్తం ప్యారానగర్ కు తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసినట్లే. దయచేసి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపేయాలి. లేదంటే న్యాయం కోసం కోర్టుకైనా వెళతాం.

కోర్వి సురేశ్, నల్లవల్లి

 డంప్ యార్డ్ కు మేం ఒప్పుకోం 

ప్యారా నగర్ లో డంప్ యార్డ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోం. అందరం కలిసి ఐకమత్యంగా పోరాడి పొలాలను కాపాడుకుంటాం. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ నిర్మించవద్దు. నల్లవల్లి పంచాయతీ తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. 

భాను ప్రకాశ్​, నల్లవల్లి