సర్వేల పేరుతో రాజకీయం బంద్ చేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

సర్వేల పేరుతో రాజకీయం బంద్ చేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట/పెన్ పహాడ్, వెలుగు:  రైతుల సమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్ష నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ నేతలు పరువు తీసుకుంటున్నారని, వెంటనే సర్వేల పేరుతో చేసే రాజకీయాలను బంద్​ చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో, పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్ మండలం పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన వరి పొలాల పరిశీలన ఆయన  మాట్లాడారు.

కేసీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కేటీఆర్, తన ఆస్తుల సర్వేల పేరుతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్ష నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతూ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంపితేనే వెళ్లామని చెబుతున్న ఈ చిల్లర వేషాలు, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు.  రాష్ట్రంలో కరెంట్, సాగునీరు సక్రమంగా అందించక వందలాది ఎకరాల పంటలు ఎండిపోతుంటే, రైతుల గోసను కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఈ నాటకాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. కన్నేపల్లి పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నీళ్లున్నా, ప్రభుత్వం కావాలనే కరెంట్ కోతలు విధిస్తూ పంటలను ఎండబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన రైతులకు సాగునీరు, 24 గంటల కరెంట్ అందించి చేతికొచ్చిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.