పొద్దున్నే లుంగీలో థాయిలాండ్ పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు

పొద్దున్నే లుంగీలో థాయిలాండ్ పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు

బంగ్లాదేశ్ లో  షేక్ హసీనాలోని సర్కార్ కుప్పకూలాక ఆ దేశంలో నిరసనలు, అల్లర్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా కూడా ఆ దేశం విడిచి పారిపోయింది. లేటెస్ట్ గా ఆ దేశ మాజీ అధ్యక్షుడు  అబ్దుల్ హమీద్ కూడా  బంగ్లాదేశ్ విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. అబ్దుల్ హమీద్ లుంగీలోనే  గత వారం తెల్లవారుజామున 3 గంటలకు  ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానం ఎక్కి  పారిపోయినట్లు సమాచారం.   వెంటనే అప్రమత్తమైన ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విద్యా సలహాదారు సిఆర్ అబ్రార్ నేతృత్వంలో  దర్యాప్తుకు  ఉన్నతస్థాయి కమిటీ వేసింది. కొంతమంది  అధికారులను బదిలీ చేసింది.

అబ్దుల్ హమీద్  కుటుంబ సభ్యులు ఆయన సోదరుడు,  బావమరిదితో కలిసి వైద్య చికిత్స కోసం థాయిలాండ్ వెళ్లారని చెబుతున్నారు.  కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం అత్యకేసులో  విచారణ నుండి తప్పించుకోవడానికి పారిపోయారని చెబుతున్నారు.  హమీద్ వీల్‌చైర్‌లో లుంగీలో వెళ్తున్న దృశ్యాలు  CCTV లోరికార్డ్ అయ్యాయి. 

అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు కావడానికి ముందు హసీనా అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.  తర్వాత  షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో 2013 నుంచి 2023  మధ్య   రెండు సార్లు  బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో జరిగిన ఆందోళనల్లో నిరసనకారులపై దాడులు,హత్యాయత్నం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే 2025 జనవరి 14న కిషోర్ గంజ్ సదర్ పీఎస్ లో నమోదైన కేసులో  అబ్దుల్ హమీద్ నిందితుడిగా ఉన్నారు.  హసీనా , ఆమె కుటుంబ సభ్యులు షేక్ రెహానా, సజీబ్ వాజెద్ జాయ్ , సైమా వాజెద్ పుతుల్ సహ నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్ కూడా ఈ కేసులో సహ నిందితుడు. అప్పటి నుంచే అబ్దుల్ హమీద్ కనిపించకుండా పారిపోయాడు.