ఉమ్మడి పాలమూరులో గాలివాన బీభత్సం

ఉమ్మడి పాలమూరులో గాలివాన బీభత్సం

వెలుగు, నెట్​వర్క్:  ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్ కర్నూల్  జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లి శివారులో పిడుగుపాటుతో గొర్రెల కాపరి మల్లయ్య (45) చనిపోయాడు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి శివారులో పిడుగుపాటుతో 30 గొర్రెలు మృతి చెందాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డును వర్షం నీళ్లు ముంచెత్తడంతో వేలాది బస్తాల వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.

మార్కెట్ యార్డు జలమయమై చెరువును తలపించగా, కళ్ల ముందే పంట నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయ్యారు. రైతులు వడ్లను కాపాడుకునేందుకు తీవ్రగా శ్రమించారు. యార్డులో సరైన షెడ్లు, టార్పాలిన్లు, డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు వాపోయారు.

విరిగిపడిన చెట్లు, కార్లు ధ్వంసం

ఈదురు గాలులు మహబూబ్ నగర్  నగరంలో బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని పిస్తా హౌస్, అప్పన్నపల్లి, కలెక్టరేట్  ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. కలెక్టరేట్​ సమీపంలో ఉన్న బస్​ షెల్టర్  షెడ్​ ఎగిరిపోయింది. పిస్తా హౌస్  వద్ద పార్కింగ్  చేసిన కార్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

దీంతో రెండు కార్లు దెబ్బతిన్నాయి. అప్పన్నపల్లి వద్ద ఉన్న హనుమాన్  ఆలయంలో ఆవరణలో భారీ చెట్లు విరిగిపడడంతో ధ్వజ స్తంభం విరిగిపడింది. పలుచోట్ల రోడ్ల వెంట చెట్లు నేలకూలాయి. వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి పలు మండలాల్లో చెట్లు, కరెంట్​ పోల్స్​ పడిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు నేలకొరిగాయి.

కొత్తకోట, మదనాపురం మెయిన్​ రోడ్డులో భారీ వేప చెట్టు రోడ్డుపై అడ్డంగా పడడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఎంపీడీవో ఆఫీస్​ వద్ద కరెంటు పోల్స్​ విరిగిపడ్డాయి. ఆత్మకూరు, మదనాపురం మధ్య చెట్లు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి పట్టణంలోనూ ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకూలాయి. చందాపూరు రోడ్డుకు అడ్డంగా కరెంట్​ స్తంభాలు పడి రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం నుంచి కరెంట్​ సరఫరా నిలిచిపోయింది.