'బలగం' కథ నాదే.. సతీష్ ఎవరో నాకు తెలీదు : డైరెక్టర్ వేణు

'బలగం' కథ నాదే.. సతీష్ ఎవరో నాకు తెలీదు : డైరెక్టర్ వేణు

సతీష్ కథకి తన కథకి ఎలాంటి సంబంధం లేదని బలగం సినిమా డైరెక్టర్ వేణు చెప్పారు. సతీష్ బ్లాక్ మెల్ చేస్తున్నాడని, నమస్తే తెలంగాణ రిపోర్టర్ మధుకి ఫోన్ చేసి బతిమిలాడితే నిర్మాత దిల్ రాజు దగ్గరికి తీసుకొచ్చాడని తెలిపారు. దిల్ రాజు భయపడ్డాడని ప్రెస్ మీట్ లో సతీష్ చెప్పినట్టు వేణు చెప్పారు. దిల్ రాజు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. బలగం సినిమా కథ కాదని.. ఇది ఒక జీవితమని, ఒక మూమెంట్ అని చెప్పారు. ఇది తెలంగాణ సంస్కృతి అని.. ఇదే సంస్కృతిపై 100 మంది100 సినిమాలు తీయొచ్చని వేణు అన్నారు. దీనిపై తానే న్యాయపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను సతీష్ కి చెబితే... నేను పేదోన్ని, ఒక జర్నలిస్ట్ ని అని చెప్పాడని తెలిపారు.  తాను కూడా ఒక సాధారణ వ్యక్తినేనన్న వేణు... మీడియాలో పనిచేసే అందరూ పెదవాళ్లేనన్నారు. తాను సిరిసిల్లలో కొత్తిమీర, కూరగాయలు అమ్ముకున్నానని, సినిమా మీద ఆసక్తితో... హైదరాబాద్ లో కూలీ పని చేసానని, టచప్ బాయ్ గా కూడా పనిచేశానన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడిదాకా వచ్చానని చెప్పారు. అయినా సతీష్ కథ వేరు.. తన కథ వేరు అని వేణు అన్నారు. ఆయన రచయితల సంగం దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయమని కూడా చెబుతున్నానన్నారు. వాళ్ళు ఏది చెప్తే అది తాను వింటానని స్పష్టం చేశారు. సతీష్ ఎవరో కూడా తనకు తెలీదన్న వేణు... ఇప్పుడు వచ్చి నాది అనడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కథ తనదేనని... డైరెక్ట్ చేసింది కూడా తానేనని తేల్చి చెప్పారు. సతీష్ వచ్చి తనతో మాట్లాడాలి కానీ దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నలు సంధించారు.

అప్పుడే ఈ స్టోరీ స్ట్రైక్ అయింది...

బలగం సినిమాని ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని వేణు అన్నారు.  ప్రతీ ఒక్కరూ జెన్స్యూన్ గా రివ్యూ ఇచ్చారన్న ఆయన..  ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఇది హిట్ సినిమా అని ఎవరు చెప్పట్లేదు... కానీ గొప్ప సినిమా అంటున్నారని తెలిపారు. సింగిల్ గా చూసినవాళ్ళు ఫ్యామిలీతో మళ్ళీ చూస్తున్నారని తెలిపారు. తమది చాలా పెద్ద ఫ్యామిలీ అని.. దాదాపు100 మంది ఉంటారని వేణు చెప్పారు. తెలంగాణలో పెళ్లయినా... చావయినా పండగేనన్న ఆయన.. తాను 18 ఏళ్ళు ఉన్నప్పుడు తన పెదనాన్న, ఆ తర్వాత రెండో పెదనాన్న, పెద్దమ్మ చనిపోయారన్నారు. చనిపోయినప్పుడు తాగుతున్నారు, ఏడుస్తున్నారు, కొట్లాడుకుంటున్నారు. .. మళ్ళీ నార్మల్ గా అయిపోతున్నారని వేణు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడే తనకు ఈ స్టోరీ స్ట్రైక్ అయిందన్న వేణు.. తన ఫ్రెండ్ అనుదీప్ తో కలిసి తెలంగాణ మొత్తం తిరిగానని, పిట్టకి ముట్టకపోవడంపైనా చాలా మంది పెద్దమనుషులతో మాట్లాడానన్నారు. ఈ ఒక్క సినిమా కథ కోసం ఆరేళ్ళు కష్టపడ్డానని చెప్పారు. బలగం సినిమా కోసం బుడగజంగాల వాళ్ళని కూడా కలిశానని, వాళ్ళతో పాట కూడా పాడించానన్నారు. ఈ సాంప్రదాయం మన అందరిదీ అన్న డెరెక్టర్ వేణు.. ఇది ఏ ఒక్కరి సొంతం కాదని, ఇది నాది అంటే కుదరదని చెప్పారు. అయినా- ఈ సినిమాతో రూ.100ల కోట్లు ఏమి రావని, మన కల్చర్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తాపత్రయంతోనే తన కథని సినిమా రూపంలో దిల్ రాజు తీసుకొచ్చారని వేణు స్పష్టం చేశారు.