
- నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ స్కూళ్లు
- రెన్యూవల్ లేకున్నా పట్టించుకోని అధికారులు
- అనుమతులు నిల్,
- ఆదాయం ఫుల్
- డ్రైవింగ్ స్కూల్సర్టిఫికెట్లతో రూ.లక్షల్లో వ్యాపారం
కరీంనగర్ క్రైం, వెలుగు :
రాష్ట్ర ఖాజానాకు అధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో రవాణా శాఖ ముందు వరుసలో ఉంటుంది. రూ.కోట్ల ఆదాయం ఖజానాకు జమ చేసే రవాణాశాఖ అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అటు ఖజానాకు ఇటు తమ ఖాళీ జేబులను నింపుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. శాఖాపరంగా చేయాల్సిన విధులు కూడా పట్టించుకోకుండా ఆదాయం వస్తుందనే సాకుతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం మూలంగా జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్చుకొచ్చాయి. జిల్లా అంతటా అధికారికంగా పర్మిషన్ ఉన్నవి 31 స్కూళ్లు కానీ క్షేత్ర స్థాయికొస్తే వీధికొకటి దర్శనమిస్తున్నాయి. అనుమతులు ఉన్న 31 స్కూళ్లు కూడా తమ లైసెన్సులు పునరుద్ధరించకపోయినా వారిచ్చే డ్రైవింగ్ ధ్రువపత్రాలకు అధికారులు అనుమతి ఇస్తుండడం విచిత్రం అనిపించక మానదు. జిల్లా రవాణా శాఖలో నెలకొన్న నిలువెత్తు నిర్లక్ష్యం పై వెలుగు కథనం..
నిబంధనలు..
డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే ట్రైయినర్‌కు రోడ్డు భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. మోటర్ వాహనాలకు సంబంధించిన విద్యతో ఏదో ఒక సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఇవి ఉన్న వారికే ఆర్టీఏ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూల్ నడపడానికి అనుమతిస్తుంది. అనుమతి పొందిన డ్రైవింగ్ స్కూల్లో ఒక గది ఉండాలి. అందులో రోడ్డు నిబంధనల సూచికలు ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల పాటుశిక్షణ ఇవ్వాలి. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు విడిభాగాలను ప్రదర్శనగా ఉంచాలి. వాటి పనితీరుపై శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాతనే కారును నడిపేందుకు మైదానంలో శిక్షణ ఇవ్వాలి.
డ్యూయల్ కంట్రోల్.. మెకానిజం
డ్రైవింగ్‌స్కూళ్లకు చెందిన వాహనాలకు తప్పకుండా డ్యుయల్ కంట్రోల్ సిస్టం ఉండాలి. నిబంధన ప్రకారం కచ్చితంగా టాక్సీ ప్లెట్ వెహికల్ మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించాలి. డ్రైవింగ్ తోపాటు మెకానిజం కూడా నేర్పాల్సి ఉంటుంది. డ్యూయల్ డ్రైవింగ్ సిస్టం కొన్ని వాహనాల్లో లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహనాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమం లో అనూహ్యంగా ఆగిపోయే సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ సందర్భంగా నేర్పాల్సి ఉంటుంది.
శిక్షణ మాత్రమే ఇవ్వాలి
జిల్లా పరిధిలో సూమారు వందకు పైగా డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్ది, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. వీరంతా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక్కసారైనా డ్రైవింగ్ స్కూళ్లకు వెళ్లాలి. అలా వెళ్లి శిక్షణ తీసుకుంటేనే డ్రైవింగ్‌లో మెళకులను శిక్షకులు ప్రత్యేకంగా నేర్పిస్తారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర భారీ వాహనాలు ఏవైనా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నిబంధనలు వాహనం నేర్చుకునే సమయంలో తెలుసుకుంటేనే ప్రమాదాలకు చోటు లేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఉన్న డ్రైవింగ్ స్కూళ్లలో కనిపించడం లేదని పలువురు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
పేరుకు మాత్రమే డ్రైవింగ్‌లో శిక్షణ.. చేసేదంతా లైసెన్సులను ఇప్పించడంపైనే ధ్యాస. రవాణా శాఖ నుంచి అనుమతి పొందిన డ్రైవింగ్ స్కూళ్లు నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. రవాణా చట్టం ప్రకారం 30 రోజుల పాటు శిక్షణనివ్వాలి. అవసరమైతే మరి కొన్ని రోజులు శిక్షణనిచ్చిన తర్వాతే డ్రైవింగ్ పరీక్షకు పంపాలి. లైసెన్సుల జోలికి వెళ్లకూడదు. వాటిని వాహనదారులే స్వయంగా తమ పరిధిలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి మొదట లెర్నింగ్ లైసెన్సు, 30 రోజులైన తర్వాత డ్రైవింగ్ పరీక్షలకు వెళ్లాలి. కానీ ఇలా ఎక్కడా జరగడం లేదు. అడిగినన్ని డబ్బులు చెల్లిస్తే చాలు డ్రైవింగ్ శిక్షణతో పాటు అన్ని రకాల వాహనాల లైసెన్సులు ఇప్పిస్తామంటూ నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్నారు. కేవలం డ్రైవింగ్ మాత్రమే నేర్చుకునేందుకు వచ్చే వారిని మాటలతో మభ్యపెట్టి లైసెన్స్ తీసుకునేలా చేస్తున్నారు.
ఇష్టానుసారంగా..
డ్రైవింగ్ శిక్షణ వచ్చే వారి నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారు. శిక్షణ మాత్రమే అయితే రూ.నాలుగు వేలు వసూలు చేస్తున్నారు. లైసెన్సు కావాలంటే మరో రూ.2500 చెల్లించాల్సిందే. డ్రైవింగ్ చేయకున్నా.. పరీక్షకు వెళ్లకున్నా.. లైసెన్సు వీరి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఆర్‌టీఏ అధికారులు డ్రైవింగ్ స్కూళ్లపై నిఘా వేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారు. డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలు ఒక వాహనానికి అనుమతి తీసుకుని అదనంగా రెండు, మూడు కార్లను శిక్షణకు ఉపయోగిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు మామూళ్ల మత్తులో పడి తనిఖీలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యాలు , ఆర్టీఏ అధికారుల ఫీజుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. చాలాచోట్ల మెకానిజం నేర్పే ఇన్‌స్ట్రక్టర్ లేకపోవడంతో నామమాత్రంగా శిక్షణనిచ్చి వదిలేస్తున్నారు. రహదారి భద్రత నియమాలపై స్టూడెంట్స్‌కు సరైన అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ నైపుణ్యం లేని శిక్షణ అందిస్తున్నారు. కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో అనుమతి లేని కార్లను ఉపయోగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు జోక్యం చేసుకుని డ్రైవింగ్ స్కూళ్లకు నియమ నిబంధనలు ఏర్పాటు చేసి ధరల పట్టికను ప్రత్యేకంగా స్కూళ్లలో నోటీసు బోర్డులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.