చెప్పింది 25 లక్షల ఎకరాలు.. నీళ్లిచ్చింది లక్షన్నర ఎకరాలకే

చెప్పింది 25 లక్షల ఎకరాలు.. నీళ్లిచ్చింది లక్షన్నర ఎకరాలకే

గతేడాది కన్నా కాళేశ్వరం కింద తగ్గిన ఆయకట్టు ప్రతిపాదన
ఇరిగేషన్ బడెజ్ట్ ప్రతిపాదనల్లో  వెల్లడించిన ప్రభుత్వం
 

హైదరాబాద్‌, వెలుగు: ప్రాజెక్టుల కింద నిరుడు 25 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లిస్తామని చెప్పిన సర్కారు కేవలం 1.48 లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వగలిగింది. అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. పాలమూరు నీళ్లు ఈ ఏడాది పారిస్తామంటూ రివ్యూలతో హడావుడి చేస్తున్నా.. ఆ ప్రాజెక్టు కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఎకరా ఆయకట్టును కూడా ప్రతిపాదించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నీళ్లు ఇవ్వాలనుకునే టార్గెట్‌ను నిరుడితో పోలిస్తే ఏడు వేల ఎకరాల ఆయకట్టు తగ్గించి చూపించారు. కొత్తగా ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలను సాగులోకి తెచ్చామనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. నిరుడు 25.10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంటే, ఈ ఏడాది దాన్ని 21.66 లక్షల ఎకరాలుగా చూపించారు.
ప్రతిపాదనలు ఘనం
రాష్ట్ర ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు 16 ప్రాజెక్టుల కింద కొత్తగా 25,10,711 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని ప్రతిపాదించింది. ఒక్క కాళేశ్వరం కిందనే 12.71 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పింది. తట్టెడు మట్టి తియ్యని ప్రాణహిత ప్రాజెక్టు కింద లక్షన్నర ఎకరాలు తడుపుతామని గొప్పలు చెప్పింది. సీతారామ ఎత్తిపోతల కింద దాదాపు మూడు లక్షల ఎకరాలు, పాలమూరు కింద 70 వేల ఎకరాలు, వరద కాలువ కింద లక్షన్నర ఎకరాలకు పైగా, దేవాదుల కింద రెండున్నర లక్షల ఎకరాలు, డిండి లిఫ్ట్ కింద 90 వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పింది. టార్గెట్‌ మేరకు నీళ్లివ్వడానికి బడ్జెట్‌ కేటాయింపులు చేశామని కూడా ప్రకటించింది. అయితే 2021=22 బడ్జెట్‌ ప్రతిపాదనలకు వచ్చే సరికి సర్కారు అసలు రంగు బయట పడింది. 
ఈసారి 21.66 లక్షల ఎకరాలు..
ఈ ఏడాది ప్రాజెక్టుల కింద కొత్తగా 21.66 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో 12.64 లక్షల ఎకరాలు తడుపుతామని వెల్లడించారు. దేవాదుల కింద నిరుడు కన్నా లక్ష ఎకరాల టార్గెట్‌ తగ్గించుకుని ఒకటిన్నర లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. వరద కాలువ కింద రెండు లక్షల ఎకరాలు ప్రతిపాదించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద 3.87 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజ్‌-2, ఏఎమ్మార్‌ ఎస్‌ఎల్బీసీ కింద 50 వేల ఎకరాలు, ఎల్లంపల్లి లిఫ్టుల కింద 30 వేల ఎకరాలు, కల్వకుర్తి కింద 28,232 ఎకరాలు, లోయర్‌ పెన్‌గంగా, డిండి లిఫ్టు కింద పది వేల ఎకరాలు చొప్పున, చిన్న కాళేశ్వరం కింద 6,730 ఎకరాలు, నెట్టెంపాడు కింద 6 వేల ఎకరాలు, గట్టు, భీమా లిఫ్టుల కింద ఐదు వేల ఎకరాలు చొప్పున, కోయిల్‌సాగర్‌ కింద వెయ్యి ఎకరాలను సాగులోకి తెస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఐదు మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద 41,941 ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారు.

ఈ ఏడాది ‘పాలమూరు’ నీళ్లు ఇచ్చుడే లేదు
కృష్ణా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నా.. ప్రజావ్యతిరేకత ఎదురుకాకుండా నిత్యం రివ్యూల పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోంది. సీఎం కేసీఆర్‌ నాలుగు రోజుల్లో వరుసగా మూడు సార్లు కృష్ణా ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు. అధికారులు, ఇంజనీర్లతో అర్ధరాత్రి వరకు మీటింగ్ లు కొనసాగించారు. పాలమూరు ప్రాజెక్టు నీళ్లు డిసెంబర్‌ నాటికి ఎత్తిపోసి ఆయకట్టును తడుపుతామని చెప్తున్నారు. కానీ ఇరిగేషన్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మాత్రం ఈ ప్రాజెక్టు కింద 2021–22లో కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా నీళ్లిస్తామని పేర్కొనలేదు. వచ్చే ఏడాది మాత్రం 3.17 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే అవకాశముందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.11,030 కోట్లు ఖర్చు చేశామని, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆరున్నరేళ్లలో 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేసిన ప్రభుత్వం, ఏడాదిలోనే ప్రాజెక్టు పనులు ఎలా కంప్లీట్‌ చేస్తుందనే ప్రశ్న ఆయకట్టు రైతుల నుంచి వ్యక్తమవుతోంది.