ప్రపంచ చరిత్రలో ఏ సీఈవో తీసుకోని కనీసం కలలో కూడా ఊహించని పే ప్యాకేజీని అందుకోబోతున్నాడు ఎలాన్ మస్క్. వాస్తవానికి అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా కంపెనీ షేర్ హోల్డర్లు తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈవీ కంపెనీని ఏఐ, రోబోటిక్స్ వంటి రంగాల్లో ముందుకు నడిపించేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నాలను పెట్టుబడిదారుల నుంచి మద్ధతు లభిస్తోంది.
ఈ క్రమంలో టెస్లా పెట్టుబడిదారుల్లో 75 శాతం మంది ఎలాన్ మస్క్ కి భారీ పే ప్యాకేజీని అందించటానికి అంగీకారం తెలిపారు. కంపెనీ టెక్సాస్ ఆస్టిన్ లో ఏర్పాటు చేసిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇది జరిగింది. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ తాజా షేర్ హోల్డర్ అంగీకారంతో 1 ట్రిలియన్ యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.8లక్షల 50వేల కోట్ల విలువైన టెస్లా షేర్లను రానున్న 10 ఏళ్ల కాలంలో అందుకోబోతున్నట్లు వెల్లడైంది. రికార్డు స్థాయిలో జీతం ప్యాకేజీ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అందరూ భావిస్తున్నారు.
ALSO READ : నవంబర్ 12న టెనెకో క్లీన్ ఎయిర్ ఐపీఓ ఓపెన్
టెస్లా భవిష్యత్తు, దాని వాల్యుయేషన్ కోసం ఈ ఓటు చాలా కీలకం. ఇది మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను తయారు చేయడం, US అంతటా రోబోటాక్సీ నెట్‌వర్క్‌ను సృష్టించడం, హ్యూమనాయిడ్ రోబోట్‌లను విక్రయించడం అనే అతని భవిష్యత్ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ అమెరికా రాజకీయాలపై చేసిన కామెంట్స్ ఈ సంవత్సరం టెస్లా బ్రాండ్‌ను దెబ్బతీసింది. తాము టెస్లా భవిష్యత్తుపై ఒక కొత్త పుస్తకం తెరవబోతున్నట్లు మస్క్ పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో చెప్పాడు. ఇదే క్రమంలో ఎక్స్ఏఐలో టెస్లా పెట్టుబడులకు కూడా ఇన్వెస్టర్లు అనుకూలంగా ఓటు వేశారు.
