కామారెడ్డి, వెలుగు: తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక వాటిని చంపేశారు. విషాహారం ద్వారా ఐదు గ్రామాల్లో సుమారు 500 కుక్కలను చంపించి, గుట్టు చప్పుడు కాకుండా గోతులు తీసి పాతిపెట్టారు. ఓ జంతు సంరక్షకుని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది.
కామారెడ్డి జిల్లా మాచారం మండలంలోని మూడు గ్రామాల్లో జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టగా, బుధవారం 244 కుక్కల కళేబరాలు బయటడ్డాయి. మరో రెండు గ్రామాల్లో తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానీపేట, ఫరీద్‌పేట, పాల్వంచ, వాడి, బండరామేశ్వర్‌పల్లి గ్రామాల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది.
ఈ క్రమంలో గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామని ప్రస్తుత సర్పంచులు హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కుక్కల నివారణకు ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఐదుగురు సర్పంచులు కలిసి కుక్కలను చంపేందుకు ప్లాన్‌వేశారు. ఇందుకోసం బయట నుంచి కొందరు వ్యక్తులను పిలిపించి ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 9న ప్లాన్ప్రకారం రాత్రిపూట వీధుల్లో విషాహారం పెట్టి కుక్కలను చంపించారు. రాత్రికి రాత్రే ఆయా గ్రామ శివారుల్లో పెద్ద గోతులు తీసి కుక్కల కళేబరాలను పాతిపెట్టారు.
‘సఫీ’ ప్రతినిధి ఫిర్యాదుతో వెలుగులోకి..
కుక్కలకు విషం పెట్టి చంపించిన విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా కరీంనగర్ కు చెందిన ‘స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(సఫీ)’ సంస్థ ప్రతినిధి గౌతమ్చెవిన పడింది. దీంతో ఆయన వెంటనే భవానీపేట వచ్చి వివరాలు సేకరించారు. కుక్కలకు మందు పెట్టి చంపించారని నిర్ధారించుకున్న తర్వాత భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట, వాడి, బండరామేశ్వర్‌పల్లి సర్పంచ్‌లపై ఈ నెల 12న మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంస్థ ప్రతినిధులు, వెటర్నరీ డాక్టర్ల తో కలిసి జేసీబీ సాయంతో భవానిపేట, ఫరీద్‌పేట, పాల్వంచ గ్రామాల శివార్లలో కుక్కలను పాతి పెట్టిన చోట బుధవారం తవ్వకాలు చేపట్టారు.
మొత్తం 244 కుక్కల కళేబరాలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వాడి, బండరామేశ్వర్‌పల్లిలో ఇంకా కళేబరాలు లభించలేదని, పాతిపెట్టిన జాగల కోసం వెతుకుతున్నామని మాచారెడ్డి ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. 5 గ్రామాల సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. కాగా, కుక్కలకు మందుపెట్టేందుకు ఎవరిని పిలిపించారు? వారు ఆహారంలో ఏ మందు కలిపారు? అనే వివరాలు దర్యాప్తులోనే తెలుస్తాయని ఎస్ఐ పేర్కొన్నారు.
