ఓయూలో పీహెచ్​డీ అడ్మిషన్ల స్ట్రీమ్​లైన్

ఓయూలో పీహెచ్​డీ అడ్మిషన్ల స్ట్రీమ్​లైన్
  • థీసిస్ సబ్మిట్ చేయనివారిపై చర్యలు తీసుకుంటామన్న ఓయూ 
  • ఆ తర్వాత అడ్మిషన్లు పొందిన వారికి 2023 జూన్ వరకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్​డీ అడ్మిషన్లను స్ట్రీమ్​లైన్​ చేస్తున్నామని, త్వరలోనే అడ్మిషన్లకు కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. 2017 కంటే ముందు అడ్మిషన్లు పొంది, ఇప్పటికీ కంప్లీట్ చేయని వారి అడ్మిషన్లను రద్దు చేస్తున్నామని, ఆ తర్వాతి ఏడాది అడ్మిషన్లు పొందిన స్టూడెంట్లకు 2023 జూన్​వరకు టైమ్ ఇచ్చామని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టడంతోనే 10–15 ఏండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న 1,280 మంది పీహెచ్​డీలు క్లియరయ్యాయని అన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్​లో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణతో కలిసి రవీందర్​ మీడియాతో మాట్లాడారు.
21 పాయింట్ల ఎజెండాతో రోడ్​ మ్యాప్
ఓయూ అభివృద్ధికి 21 పాయింట్ల ఎజెండాతో రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకెళుతున్నామని రవీందర్ ​చెప్పారు. న్యాక్, అటానమస్ కలిగిన ప్రైవేటు కాలేజీల్లోనూ పీహెచ్​డీ చేసేందుకు వీలుగా స్టూడెంట్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. స్టూడెంట్లకు బార్​ కోడ్​ కలిగిన యూనిక్​ ఐడీ కార్డులను త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. వర్సిటీలో 65% మంది అమ్మాయిలు ఉన్నారని, వారి భద్రత కోసం 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి వల్ల వర్సిటీ భూములు కబ్జాకు గురికాకుండా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా రెండు హాస్టళ్లను నిర్మించేందుకు సర్కారుకు ప్రపోజల్ పెడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని, వచ్చే నెలలో సెంటర్ ఫర్ ఇండో–పసిఫిక్ ను ప్రారంభిస్తామని చెప్పారు. 
మా వర్సిటీ.. మన ఉస్మానియా పేరుతో..
ఓయూలో ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్​లో ఈ–ఆఫీస్ అమలవుతోందని, త్వరలోనే అన్ని కాలేజీల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవీందర్​ చెప్పారు. మన ఊరు–మన బడి తరహాలో ‘మా యూనివర్సిటీ.. మన ఉస్మానియా’’ పేరుతో తాము వర్సిటీ అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.
ఆర్ట్స్ కాలేజీ దగ్గర బ్యానర్ కూడా కట్టనీయం
ప్రతి రోజూ ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసనలు జరుగుతుండటంతో మెజార్టీ స్టూడెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో స్టూడెంట్ల సమావేశాలు, చర్చలు, నిరసనలు చేసుకునేందుకు సెంటర్ ఫర్​ డిస్కోర్స్ ను ఏర్పాటు చేశామని రవీందర్ చెప్పారు. ఇక ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసనలే కాదు.. బ్యానర్ కూడా కట్టనీయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే రోజు వర్సిటీలో ఎగ్జామ్స్ తోపాటు ఎలక్షన్లు కూడా ఉన్నాయని, వర్సిటీలో పొలిటికల్, మతపర మీటింగ్​లకు పర్మిషన్ ఇవ్వొద్దని గతేడాది ఈసీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎన్ని  మీటింగ్​లు పెట్టేందుకైనా హాల్స్ ఇస్తామని, ఉద్యమాలకు, డిబేట్లకు వ్యతిరేకం కాదని అన్నారు.