చిన్న వ్యాపారం.. పెద్ద విజయం.. స్ట్రీట్ వెండర్లకు రూ.1,258 కోట్ల రుణాలు

చిన్న వ్యాపారం.. పెద్ద విజయం.. స్ట్రీట్ వెండర్లకు రూ.1,258 కోట్ల రుణాలు
 
  • రాష్ట్రంలో 4.28 లక్షల మందికి బ్యాంకు లోన్లు 
  • లోన్లు చెల్లించి రూ.34 కోట్ల వడ్డీ రాయితీ పొందిన వీధి వ్యాపారులు
  • పీఎం స్వానిధి పథకం అమలులో రాష్ట్రానికి నాలుగో స్థానం 
  • త్వరలో క్రెడిట్ కార్డులు కూడా పంపిణీ

హైదరాబాద్, వెలుగు:
స్ట్రీట్​ వెండర్స్​ అంటే తోపుడుబండ్లపై తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాళ్లు. రోడ్ల పక్కన చిన్నచిన్న స్టాల్స్​ పెట్టుకొని వస్తువులు విక్రయించేటోళ్లు. వీళ్లు చేసేది చిన్న వ్యాపారమే. కానీ, దేశ జీడీపీని నిర్ణయించేది ఇలాంటి వాళ్లే. వీళ్లు అమ్మే వస్తువులు కూడా తక్కువ ధరలకు లభించేవి. ఇలాంటి వాళ్ల జీవితాలను కరోనా మహమ్మారి బలితీసుకుంది. 

వ్యాపారం లేక కుటుంబాన్ని పోషించుకోలేక చేతిలో డబ్బులు లేక కొన్ని నెలల పాటు నరకయాతన అనుభవించారు. పిల్లలకు తిండి పెట్టలేక ఇబ్బందులు పడ్డారు. కరోనా తర్వాత వ్యాపారం చేసుకోవడానికి వారికి రుణాలు పుట్టలేదు. అప్పులివ్వడానికి ప్రైవేటు వ్యాపారులు భయపడ్డారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని తీసుకొచ్చింది. 

ఎలాంటి ఆస్తిని కుదువపెట్టకుండా ఆధార్, ఐడీ కార్డు ఆధారంగా వీరికి రుణాలివ్వాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. స్ట్రీట్​ వెండర్లను గుర్తించి వారికి బ్యాంకు రుణాలు అందించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీంలో స్ట్రీట్​ వెండర్లకు రూ.1,258 కోట్ల రుణాలను అందించి జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. 

మెప్మా తరపున ఇప్పటికే 6 లక్షల మందిని గుర్తించి వీరిలో 4.28 లక్షల మందికి బ్యాంకు రుణాలు అందజేశారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులు వడ్డీ రాయితీ కింద రూ.34 కోట్లు పొందారు. రెండోసారి లోన్లు తీసుకొని సక్రమంగా చెల్లించిన 1.30 లక్షల మంది స్ట్రీట్​ వెండర్స్​కి త్వరలో క్రెడిట్​ కార్డులు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 

రాష్ట్రంలో 6 లక్షల మంది స్ట్రీట్​ వెండర్స్​

పీఎం స్వానిధి స్కీం 2020–21లో స్టార్ట్​ చేశారు. ఈ పథకంలో భాగంగా స్ట్రీట్​వెండర్స్​కి మొదట రూ.10 వేలు, రెండోసారి రూ.25 వేలు, మూడోసారి రూ.50 వేల చొప్పున రుణాలు అందించారు. ప్రభుత్వం గుర్తించిన వారికి బ్యాంకర్లు ఎలాంటి ఆస్తిని కుదవపెట్టుకోకుండానే లోన్లు ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో6 లక్షల మంది స్ట్రీట్ వెండర్లు​ఉన్నట్లు మెప్మా ఆఫీసర్లు గుర్తించారు.  

వీరిలో 4.28 లక్షల మందికి ఐడీ కార్డులు అందించి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,258 కోట్ల రుణాలు ఇప్పించారు. తొలి విడత లోన్లు తీసుకొని అప్పు చెల్లించిన వారిలో 1.30 లక్షల మంది రెండో విడతలో రూ.25 వేల చొప్పున లోన్లు తీసుకున్నారు. రెండు స్థాయిలలో లోన్లు తీసుకొని అప్పులు చెల్లించి మూడో విడతలో 76,900 మంది స్ట్రీట్​వెండర్లు రూ.50 వేల చొప్పున లోన్లు తీసుకున్నారు. వాయిదాల ప్రకారం అప్పు చెల్లిస్తున్నారు. 

గడువులోగా అప్పు చెల్లించిన వారికి 7 శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా వీధి వ్యాపారులు గడువులోగా బకాయిలు చెల్లించి రూ.34.29 కోట్ల వడ్డీ రాయితీ పొందారు. 

రూ.24.88 కోట్ల క్యాష్​ ఇన్సెంటివ్స్​

డిజిటల్​ పేమేంట్స్​ని ప్రొత్సహించడానికి ప్రభుత్వం స్ట్రీట్​ వెండర్లకు క్యూఆర్​ కోడ్స్​తో కూడిన స్కానర్లను అందజేస్తుంది. నెలకు 200 డిజిటల్​ పేమేంట్స్​ జరిగితే ప్రభుత్వమే రూ.100 క్యాష్​ ఇన్సెంటివ్​ అందిస్తోంది. 

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా స్ట్రీట్ వెండర్ల బ్యాంకు ఖాతాలో ఆ ఇన్సెంటివ్ ను జమచేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో డిజిటల్​ పేమేంట్స్​ ఆధారంగా ఇప్పటివరకు రూ.24.88 కోట్ల రాయితీ పొందారు. క్యాష్​ ఇన్సెంటివ్స్​ విషయంలో కూడా జాతీయ స్థాయిలో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది.

త్వరలో క్రెడిట్​ కార్డులు​


క్రెడిట్​కార్డ్​ అంటే ఏదో ఒక ఉద్యోగమో లేక వ్యాపారమో చేసేవాళ్లకు సిబిల్​ స్కోర్​ ఆధారంగా ఇస్తారు. అలాంటిది రాష్ట్రంలో 1.30 లక్షల మంది స్ట్రీట్​ వెండర్లు త్వరలో క్రెడిట్​ కార్డులు పొందనున్నారు. 

పీఎం స్వానిధి స్కీంలో భాగంగా తొలి, రెండో విడత లోన్లు తీసుకొని సక్రమంగా అప్పు చెల్లించిన వారికి క్రెడిట్​ కార్డులు అందజేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మెప్మా ఆఫీసర్లు రాష్ట్రంలో క్రెడిట్​ కార్డులు​ అందుకోవడానికి అర్హత ఉన్న వీధి వ్యాపారుల డేటా రెడీ చేస్తున్నారు.