డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్లలో పెరిగిన భయం.. అక్టోబరులో ఏం జరిగిందంటే..?

డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్లలో పెరిగిన భయం.. అక్టోబరులో ఏం జరిగిందంటే..?

డిజిటల్ గోల్డ్ విషయంలో పెట్టుబడిదారుల మనస్తత్వం మారిపోతోంది. ప్రస్తుతం వీటికి క్రమంగా క్రేజ్ తగ్గిపోతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిజిటల్ గోల్డ్ కొత్త పెట్టుబడి సాధనంగా ప్రజల నుంచి ఆదరణ పొందినప్పటికీ దానిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వెస్టర్లను కొంత వెనక్కు తగ్గేలా చేస్తోందని తెలుస్తోంది. 

దేశంలో ప్రస్తుతం యూపీఐ ద్వారా డిజిటల్ బంగారం కొనుగోలు అక్టోబర్ నెలలో 61 శాతం తగ్గిందని తాజా ఎన్పీసీఐ నివేదిక ప్రకారం వెల్లడైంది. ఇది ఈ ఏడాదిలోనే కనిష్ఠ కొనుగోళ్లుగా తేలింది. సెప్టెంబరులో రూ.వెయ్యి410 కోట్ల విలువైన డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నమోదు కాగా.. అక్టోబర్‌లో ఇది రూ.550 కోట్లకు పడిపోయింది. 

డిజిటల్ బంగారం నియంత్రణలో లేకపోవడం గురించి పెట్టుబడిదారులకు వచ్చిన హెచ్చరికలే తగ్గుదలకు ప్రధాన కారణంగా వెల్లడైంది. భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఈ నెల ప్రారంభంలోనే డిజిటల్ గోల్డ్‌పై ఎలాంటి నియంత్రణ సంస్థ లేదని స్పష్టంగా పేర్కొనటం ఇన్వెస్టర్లను అలర్ట్ చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో పలు ఫైనాన్స్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ప్రజలను ఈ ఉత్పత్తుల గురించి జాగ్రత్తలు చెప్పటం గమనార్హం. ఈ ప్లాట్‌ఫామ్‌లు అకస్మాత్తుగా మూతపడితే డబ్బు లేదా బంగారం తిరిగి పొందడం కష్టమవుతుందని సెబీ హెచ్చరించటంతో కథ మెుత్తం అడ్డం తిరిగిందని చెప్పుకోవచ్చు. 

గత నెలలలో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్ల వృద్ధి ఆకర్షణీయంగా సాగింది. పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే, జార్, గూగుల్ పే, ఇంక్రెడ్ మనీ, తనిష్క్, జియోపే వంటి అనేక యాప్‌ల ద్వారా బంగారం కొనుగోలు సౌకర్యం, తక్కువ మొత్తంతో పెట్టుబడి అవకాశాలు కస్టమర్లను ఆకట్టుకున్నాయి. జనవరిలో రూ.762 కోట్ల కొనుగోళ్లతో ఉన్న ఈ పెట్టుబడులు.. సెప్టెంబరులో అత్యధికంగా రూ.వెయ్యి 410 కోట్లకు పెరిగాయి. డిజిటల్ గోల్డ్‌ను MMTC-PAMP, SafeGold వంటి సంస్థలు టోకెన్ రూపంలో భద్రపెడతాయి. వీటికి GST, స్టోరేజీ చార్జీలు, ప్లాట్‌ఫార్మ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.