హైదరాబాద్, వెలుగు: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినా, సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్ )లో రేషన్ బియ్యం కలిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్స్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం ఆయన సివిల్ సప్లయ్స్ భవన్‌లో పలు జిల్లాల అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
బియ్యం నాణ్యత విషయంలో మిక్స్ ఇండికేటర్ టెస్ట్ తప్పనిసరి చేయాలని అధికారులను రవీందర్ ఆదేశించారు. ప్రతి కన్‌సైన్మెంట్లో 580 బ్యాగులు శాంపిల్ డ్రా చేసి నాణ్యత పరీక్షలు చేయాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అదే స్థాయిలో నాణ్యమైన బియ్యం పంపిణీలోనూ అంతే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
జిల్లాల్లో పీడీఎస్ రైస్ అక్రమ దందాను అరికట్టాలని కోరారు. సీఎంఆర్ డెలివరీలో రీసైక్లింగ్ చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

