సమ్మర్ హాలీడేస్‌లో క్లాసులు పెడితే కఠిన చర్యలు

సమ్మర్ హాలీడేస్‌లో క్లాసులు పెడితే కఠిన చర్యలు
  • మే 6లోపు ఇంటర్ అసైన్మెంట్ మార్కులు పంపాలె 
  • ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్
     

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు మే 31 వరకు ప్రభుత్వం సమ్మర్ హాలీడేస్ ఇచ్చిందని, సెలవుల్లో ఆఫ్లైన్, ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ,  స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి డైరెక్టర్ ఉమర్ జలీల్ తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే స్టూడెంట్లందరినీ ప్రమోట్ చేసిందని,  స్టూడెంట్లకు ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని చెప్పారు. సోమవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల అసైన్మెంట్ మార్కులను మే 6 వరకు పంపించవచ్చని తెలిపారు. ఫీజులు చెల్లిస్తేనే మార్కులను బోర్డుకు పంపిస్తామని మేనేజ్‌‌మెంట్లు బెదిరిస్తే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.  స్టూడెంట్లు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో కూడా అసైన్మెంట్లు పంపించవచ్చని తెలిపారు. మే6 లోగా మార్కుల వివరాలు పంపించని మేనేజ్‌‌మెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రాక్టికల్స్ నిర్వహించడం సాధ్యం కాకపోతే రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేసే ఆలోచనలో ఉన్నామని ఉమర్ జలీల్ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్ను మే 29 నుంచి నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.