హైదరాబాద్ vs​ ముంబై..సాయంత్రం 4.30 నుంచే స్టేడియంలోకి అనుమతి

హైదరాబాద్ vs​ ముంబై..సాయంత్రం 4.30 నుంచే స్టేడియంలోకి అనుమతి
  • హైదరాబాద్ వర్సెస్​ ముంబై మ్యాచ్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా 
  • రాచకొండ సీపీ తరుణ్ జోషి

ఉప్పల్/సికింద్రాబాద్, వెలుగు : ఉప్పల్​స్టేడియంలో బుధవారం జరగనున్న సన్​రైజర్స్​హైదరాబాద్ వర్సెస్​ముంబై ఇండియన్స్​మ్యాచ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. మంగళవారం స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ముంబై, హైదరాబాద్​మ్యాచ్ కు 39 వేల మంది ఫ్యాన్స్ రానున్నారని తెలిపారు.

స్టేడియం పరిసరాల్లో 300 మంది ట్రాఫిక్​ పోలీసులు, 918 మంది సివిల్​ పోలీసులు, 12 ప్లాటూన్ల స్పెషల్​ ఫోర్స్ పోలీసులు, రెండు ఆక్టోపస్​ టీమ్స్,10 మౌంటెడ్​పోలీస్, 10 వజ్రా వాహనాలు, ఎస్ బీ , సీసీఎస్​, ఎస్ఓటీ తదితర పోలీస్​బలగాలు విధుల్లో ఉండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. నాలుగు వేల కార్లు, ఆరు వేల బైకుల పార్కింగ్​కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. స్టేడియం లోపల మఫ్టీలో లేడీ పోలీసులు డ్యూటీలో ఉంటారని, ఎవరైనా ఈవ్​టీజింగ్ కు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఎంట్రీ గేట్​వద్ద స్కానర్లు పెట్టామని

 క్షుణ్ణంగా తనికీ చేశాకే లోనికి అనుమతిస్తామని చెప్పారు. రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ రోడ్డులో ఎలాంటి వాహనాల పార్కింగ్​కు అనుమతించబోమని, ఎవరైనా రోడ్ల వెంట వెహికల్స్​పార్క్​చేస్తే సీజ్​ చేస్తామని వెల్లడించారు. రోడ్డుకు ఇరువైపులా నోపార్కింగ్​బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్​టైంలో ఎల్​బీనగర్, వరంగల్ నుంచి హబ్సిగూడ వైపు వచ్చే భారీ వెహికల్స్ ను అనుమతించబోమని, సదరు వెహికల్స్​చంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి నుంచి ఉప్పల్​వైపు వచ్చే వెహికల్స్ ను మల్లాపూర్, చంగిచర్ల క్రాస్ మీదుగా డెవర్ట్​చేస్తామని చెప్పారు. పాస్​లు కలిగిన దివ్యాంగులు గేట్ నంబర్ 3 నుంచి స్టేడియంలోకి  రావాలని సూచించారు. సాయంత్రం 4.30గంటల నుంచి ఫ్యాన్స్ ను స్టేడియంలోకి అనుమతిస్తామని వెల్లడించారు. 

స్టేడియంలోకి ఇవి తీసుకురావద్దు

ల్యాప్​టాప్​లు, వాటర్​బాటిళ్లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్​గ్యాడ్జెట్లు, మ్యాచ్​బాక్సులు, సిగరెట్లు, లైటర్లు, పదునైనా కత్తులు, బ్లేడ్లు, ప్లాస్టిక్​ వస్తువులు, బైనాక్యూలర్లు, రైటింగ్​పెన్స్, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్​ఫ్యూమ్​బాటిల్స్, బ్యాగులు, ఫుడ్​ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకురావొద్దని సీపీ సూచించారు. స్టేడియం వద్ద బ్లాక్​లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మ్యాచ్​సందర్భంగా మెట్రో, ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారని, వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు