న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని పెద్దపల్లి సహా ఇతర ప్రాంతాల్లో కొత్తగా యూత్ హాస్టల్స్ నిర్మించే ప్రతిపాదనలు ఏవీ ప్రస్తుతం తమ వద్ద పరిశీలనలో లేవని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం దేశంలో 85 హాస్టల్స్ ఉన్నట్టు తెలిపారు. ఇందులో తెలంగాణలో కేవలం మూడు హాస్టల్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ (1976), నల్గొండ (2003), వరంగల్ (2004) యూత్ హాస్టళ్లు మాత్రమే తెలంగాణలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఏపీలో ప్రస్తుతం నాలుగు హాస్టల్స్ నడుస్తున్నట్టు గణాంకాల్లో వెల్లడించారు.
