ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు : ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ 

ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు : ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ 

ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లాలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ ఒక ప్రకటనలో తెలిపారు. కత్తులు, తల్వార్లు, మారణాయుధాలతో సోషల్‌‌ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు, అమాయకుల వద్ద రౌడీయిజం చేస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తే రౌడీషీట్లు, సస్పెక్ట్‌‌ షీట్లు ఓపెన్‌‌ చేస్తామన్నారు. వీడీసీలు గ్రామ అభివృద్ధి పేరుతో చట్ట వ్యతిరేకంగా వసూళ్లు చేస్తూ గ్రామాల్లో బెల్ట్‌‌ షాపులు, కల్లు కాంపౌండ్లకు అనధికారికంగా అనుమతులు ఇస్తే ఊరుకునేది లేదన్నారు.

ఇసుక ట్రాక్టర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతూ, అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీ సభ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా చర్చలు తీసుకుంటామన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు, బంధువులు వాహనాలు ఇవ్వొద్దని, మైనర్‌‌ డ్రైవింగ్‌‌లో దొరికితే వాహనాలు ఇచ్చినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అధిక వడ్డీలతో ప్రజల భూములు, ఆస్తులను రాయించుకున్న వారిపై క్రిమినల్‌‌ కేసులు ఉంటాయన్నారు. పబ్లిక్‌‌ ప్లేసుల్లో ఓపెన్‌‌ డ్రింకింగ్, మద్యంసేవించి వాహనాలు నడపకూడదన్నారు. జిల్లాలో ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటించి శాంతిభద్రతలు కాపాడేందుకు సహకరించాలని కోరారు.