భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం, వెలుగు : ఈనెల 27న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నియమితులైన ఆఫీసర్లంతా 26న రిపోర్టు చేయాలని, నవమి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. సోమవారం ఆయన ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
మిథిలాస్టేడియంలో సెక్టార్లను తనిఖీ చేశారు. సెక్టార్లలో విధులు కేటాయించబడిన లైజన్, సెక్టోరియల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. 27న శ్రీరామనవమికి సీఎం, 28న పట్టాభిషేకానికి గవర్నర్ పట్టువస్త్రాలు తీసుకువస్తున్నారని తెలిపారు. కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
ఆధునిక వ్యవసాయంతో దిగుబడులు..
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతులు అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాలో ప్రగతి స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు.
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలి కుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు ఐటీడీఏ పీవో బి.రాహుల్‌తో కలిసి భద్రగిరి మార్టు పనులను తనిఖీ చేశారు. ఆదివాసీలు సేకరించిన అటవీ ఉత్పత్తులు దళారుల పాలు కాకుండా, వారికి ఉపాధి చూపించేలా మార్టును రూపొందించాలని ఆదేశించారు.
