కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక, ఆదాయ విద్యా, రాజకీయ స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అప్పుడే సమానత్వం కోసం విధానాలను రూపొందించగలమని తెలిపారు. అందులో భాగంగానే కుల గణన చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్లు కులగణన సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సర్వేలో అన్నింటినీ చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. మంగళవారం నిర్వహించిన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి ఖమ్మం జిల్లా నుంచి పాల్గొన్నారు. కుల గణనను కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించించడంతో పాటు ప్రతి టీచర్ ఎన్యుమరేటర్‌కు.. ఎన్యుమరేషన్ బ్లాక్ మ్యాప్, గృహ సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్స్ మాన్యువల్ అందే విధంగా చూసుకోవాలని సూచించారు. సర్వే క్వశ్చనీర్లో ప్రశ్నలపై పూర్తి అవగాహన ఉండే విధంగా ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని భట్టి సూచించారు. ఎన్యూమరేటర్లు ప్రతిరోజూ కేటాయించిన ఇండ్లను సందర్శించి.. సర్వే పటిష్టంగా చేపట్టి నాణ్యమైన అవుట్‌పుట్ పొందడానికి అవసరమైన సమయాన్ని కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సర్వే నిర్వహణపై ప్రతి రోజు పర్యవేక్షక సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని అన్నారు. సర్వే గురించి ప్రతి గ్రామంలో చాటింపు వేయించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కేంద్రాల నుంచి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, డి.అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, తుమ్మల పాల్గొన్నారు