- కలెక్టర్ అనుదీప్
మధిర, వెలుగు: మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు చేపడుతోందని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర పట్టణం దెందుకూరు రోడ్డులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 4,782 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.4.99 కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటివరకు రూ.60 కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. నేడు జిల్లా వ్యాప్తంగా 19,670 ఎస్‌హెచ్‌జీలకు రూ.19.27 కోట్ల రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లోనే దాదాపు 4 లక్షల ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డైరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇప్పటివరకు 250 పాడి గేదెలు పంపిణీ చేశామని, రెండో విడత త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. బోనకల్ మండలంలో రూ.1.75 కోట్లతో 9 ఎకరాల్లో పాల ప్రాసెసింగ్ యూనిట్, రూ.2 కోట్లతో 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
ఉచిత బస్సు ప్రయాణం, రూ.500ల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు మహిళల బలోపేతానికి దోహదపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
మధిర నియోజకవర్గ మహిళలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో దీక్షారైనా, డిఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
