ఢిల్లీలో జనం పరిస్థితి ఇదీ : కుండపోత వర్షంతో ఇళ్లల్లో.. భూ ప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు..

ఢిల్లీలో జనం పరిస్థితి ఇదీ : కుండపోత వర్షంతో ఇళ్లల్లో.. భూ ప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు..

 ఢిల్లీలో పరిస్థితి వింతగా మారిపోయింది.. జనం హడలిపోతున్నారు.. ఇంట్లో ఉండాలా.. ఇంట్లో నుంచి బయటకు రావాలా అన్న డైలమాతో వణికిపోయారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో జనం ఇళ్లల్లో పరిమితం అయితే.. భూ ప్రకంపనలు జనాన్ని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసేలా చేస్తుంది.. వర్షంతో ఇంట్లో ఉంటే.. భూ ప్రకంపనలు ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చాయి.. ఇలా ఢిల్లీ జనం అందర్ భాగో.. బాహర్ ఆవో అన్నట్లు ఆందోళన చెందారు. 2025 జూలై 10వ తేదీ ఉదయం ఢిల్లీని భూ ప్రకంపనలు వణికించాయి.

గురువారం (జులై 10) హర్యానాలోని ఝాజ్జర్ లో 4.4 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి ఢిల్లీ రాజధాని ప్రాంతం కంపించింది. ఉదయం 9.04 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపం కొన్ని సెకండ్ల పాటు వణికించింది. 

జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (సిస్మాలజీ) ప్రకారం.. ఢిల్లీ కి 60 కిలోమీటర్ల ఉన్న ఝాజ్జర్ లో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఈ భూకంప ధాటికి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రాం, ఫరిదాబాద్ ప్రాంతాలలో భూమి కంపించింది. ఇళ్లలో సీలింగ్ పెచ్చులు ఊడిపడినట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా హర్యానాలోని సోనిపేట్, రోహ్తక్, హిసార్ లలో కూడా బిల్డింగ్ లకు చీలికలు వచ్చినట్లు చెప్పారు. ఇంట్లోని వస్తువులు చెల్లా చెదురుగా పడిపోయినట్లు తెలిపారు. 

భూకంపానికి సంబంధించి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. భూకంపంతో ఒక్కసారిగా ఇళ్లు కూలుతున్నట్లు అనిపించిందని.. కళ్లు తిరిగినట్లు అయ్యాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి NDRF బలగాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రజలు ఆందోళనకు గురికావద్దని.. భూమి కంపించినట్లు అనిపిస్తే బయటకు వెళ్లాలని సూచించారు. ఇలాంటి సమయంలో లిఫ్ట్ వాడకుండా మెట్లదారిని వినియోగించాలని సూచించారు. 

మరోవైపు వర్షాలు:

ఢిల్లీని గత కొన్నాళ్లుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ కుండపోత వర్షాలతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సోమవారం (జులై 07) నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం ఇళ్లలోకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 60mm వర్షపాతం నమోదవ్వటంతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. 

ఢిల్లీ ఔటర్, మథువా రోడ్, మహిపల్పూర్, బిషంబర్ దాస్ మార్గ్, శాస్త్రి పార్క్, కశ్మీరీ గేట్, వెస్ట్ పటేల్ నగర్, కైలాశ్ కాలనీ, కృష్ణా నగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం నమోదైంది. దీంతో ఆ ఏరియాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జాం అయ్యింది. భారీ వర్షాలతో జనాలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సిచువేషన్ లో గురువారం (జులై 10) భూకంపం రావడంతో విధిలేని పరిస్థితుల్లో జనాలు బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది.