గిరిజన సంక్షేమంపై సీఎం కేసీఆర్​కు శ్రద్ధ లేదు

గిరిజన సంక్షేమంపై సీఎం కేసీఆర్​కు శ్రద్ధ లేదు

ఖైరతాబాద్, వెలుగు : గిరిజన సంక్షేమంపై సీఎం కేసీఆర్​కు శ్రద్ధ లేదని,  అందుకే ఎస్టీ రిజర్వేషన్ పెంపు,  ఎస్టీ యూనివర్సిటీ ఏర్పాటుపై తాత్సారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్  అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గిరిజనులకు రాష్ట్ర ఏర్పాటు జరిగినా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్  స్థాపన మొదట్లో మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ పై పెడతా అని  మాట ఇచ్చిన కేసీఆర్.. సీఎం అయ్యాక మాట మార్చారని మండిపడ్డారు.

రాజ్యాంగం ప్రకారం తమకు దక్కాల్సిన రిజర్వేషన్ల పెంపును సైతం అమలు చెయ్యకపోవడంతో గిరిజన విద్యార్థులు, యువత  విద్య, ఉద్యోగ రంగాల్లో అనేక  రకాలుగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఎస్టీలకు ఆరు నుంచి పది శాతానికి రిజర్వేషన్ ను పెంచాలని, అలాగే  రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్​ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 14 నుంచి 30 వరకు గిరిజన రిజర్వేషన్ పోరు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ‘గిరిజన రిజర్వేషన్ పోరు యాత్ర’ పోస్టర్ ను  ఆవిష్కరించారు. ఈ సమావేశంలో  బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, ఓయూ జేఏసీ నేత సంపత్ నాయక్, తదితరులు   పాల్గొన్నారు.